ఖైరతాబాద్, డిసెంబర్ 24: ఎన్నికల ముందు యాదవులకు మంత్రి పదవులు ఇస్తాం, కార్పొరేషన్ల చైర్మన్ గిరీలు కేటాయిస్తాం.. అది చేస్తాం… ఇది చేస్తామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేసిండని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చక్రధర్ యాదవ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వం యాదవులకు సముచిత స్థానం కల్పించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవులకు ఒక మంత్రి పదవీ, ఐదు ఎమ్మెల్యేలు, మూడు కార్పొరేషన్లు, రాజ్యసభ, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ, ఎమ్మెల్సీ తదితర పదవులు ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు.
రాష్ట్ర జనాభాలో 15 శాతం ఉన్న యాదవులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే కేటాయించారని, అది కూడా నగరంలో కేటాయించారని, కానీ, కాంగ్రెస్ పై ఉన్న అయిష్టతతో ప్రజలు ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించలేదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్‌కు మంత్రి పదవీ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐదు కార్పొరేషన్ చైర్మన్, మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాలన్నారు. ఏడాది కావొస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్ర చరిత్రలో యాదవులకు ఒక్క స్థానం కూడా కల్పించని ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 28న ఇందిరా పార్కు వద్ద ధర్నా, నిరాహార దీక్షలు చేపడుతామన్నారు. అప్పటికీ, ప్రభుత్వం దిగి రాకపోతే రాష్ట్ర అగ్ని గుండంగా మారుతుందని, లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క యాదవుడు కాంగ్రెస్‌కు ఓటు వేయరని, ఆయా ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామన్నారు. ఈ సమావేశంలో యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి గుడెగె శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ అధ్యక్షులు జి రవి యాదవ్, శ్రీశైలం యాదవ్, కేశబోయిన వీరేందర్ యాదవ్, రాచంద్రం యాదవ్, శివ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, కార్తీక్ యాదవ్ తదితరులు
పాల్గొన్నారు.