సిటీబ్యూరో, మే 14(నమస్తే తెలంగాణ): రాజధాని ఓటర్ రూట్ మారింది. 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే అన్ని లోక్‌సభ స్థానాల్లో ఒక్క మల్కాజిగిరి మినహా చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్లో ఓటింగ్ శాతం పెరిగింది. హైదరాబాద్ నుంచి చాలా మంది సెటిలర్లు, ప్రజలు తమ తమ సొంతూర్లకు ఓటింగ్ కోసం వెళ్లినా… రాజధాని ఓటర్లు తమ సత్తా చాటారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్‌లో 44.84 శాతం పోలింగ్ నమోదైతే ఈ సారి 48.48 శాతంగా నమోదైంది. దాదాపు 4 శాతం పోలింగ్ అధికంగా నమోదైంది. ఇదే క్రమంలో చేవెళ్లలోనూ ఓటింగ్ శాతం పెరిగింది. ఇక్కడ 2019 ఎన్నికల్లో 53.25 శాతం పోలింగ్ నమోదవ్వగా..ఈ ఎన్నికల్లో 56.40 శాతం నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే..2 శాతానికి పైగా ఓటర్లు పెరిగారు. అత్యధికంగా చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లో 71.83 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా శేరిలింగంపల్లి సెగ్మెంట్లో 43.91 శాతం నమోదైంది. సికింద్రాబాద్‌లోనూ ఇదే రీతిలో పోలింగ్ శాతం అధికంగా నమోదైంది. గత లోక్‌సభ ఎన్నికల్లో 46.50 శాతం నమోదు కాగా ఈ సారి 49.04 శాతం నమోదైంది. మల్కాజిగిరిలో మాత్రం గత లోకసభ ఎన్నికల్లో 49.63 శాతం నమోదు కాగా..ఈ సారి రూ. 50.78 శాతం మేర నమోదైంది. కాగా మూడు పార్లమెంట్ పరిధిలో పెరిగిన పోలింగ్ సరళితో ఎవరికి నష్టం! ఎవరికి మేలు! అన్న దానిపై రాజకీయ పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. మరో పక్క అధికార యంత్రాంగం జూన్ 4న జరిగే కౌంటింగ్‌పై దృష్టి పెట్టింది. మొత్తంగా కౌంటింగ్ జరిపే స్ట్రాంగ్ రూమ్‌లకు ఈవీఎంలను పటిష్ట భద్రత నడుమ తరలించారు. 144 సెక్షన్ నిషేధాజ్ఞలను ఎన్నికల అధికారులు అమలు చేస్తున్నారు. కాగా ఓటింగ్ శాతం పెరగడంలో ఎన్నికల అధికారులు చేపట్టిన ‘స్వీప్’ అవగాహన కార్యక్రమాలు ఫలించాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 50.78 పోలింగ్ శాతం నమోదైంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో మేడ్చల్ 57.83, మల్కాజిగిరిలో 51.97, కుత్బుల్లాపూర్‌లో 50.19, కూకట్‌పల్లిలో 48.48, ఉప్పల్‌లో 48.45, ఎల్బీనగర్లో 46.27, కంటోన్మెంట్లో 51.61 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం పెరిగింది. ఈ పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికీ అనుకూలమో, ప్రతికూలమో అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. హైదరాబాద్ పార్లమెంట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టిపోటీ ఇచ్చింది. దీంతో ఎంఐఎం, బీజేపీ మధ్య హోరాహోరీగా పోటీ ఉండటంతో ఎవరూ గెలిచినా స్వల్ప మెజార్టీతోనే గెలిచే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్‌కు వస్తే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల త్రిముఖ పోరు ఉంది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉందని, ప్రజలు బీఆర్ఎస్నే నమ్ముకున్నారని.. బస్తీ, మైనార్టీ ప్రజల ఓట్లతో గెలుపుపై ఆయన ధీమాతో ఉన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అర్బన్ ఎడ్యుకేటెడ్ ఓటర్లు, ఉత్తర భారతీయులపై ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ మైనార్టీ, బస్తీ వాసుల ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. పెరిగిన పోలింగ్ శాతం ఎటువైపు టర్న్ అవుతుందనేది అభ్యర్థులకు అంతుచిక్కడం లేదు. చేవెళ్లలోనూ ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నడవగా.. గెలుపుపై ఎవరి ధీమా వారే కనబరుస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ పడ్డారు. తొలి నుంచి కాంగ్రెస్, బీజేపీ ద్విముఖ పోటీగానే భావించాయి. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారడంతో త్రిముఖ పోటీ నెలకొన్నది. ఎవరికి వారు గెలుపు అవకాశాలపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇక కీలకమైన ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఎవరిని పలుకరించినా..ఎక్కడ ఇద్దరు గుమికూడినా ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది. ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. గెలుపు అవకాశాలపై ఎవరికి వారు అంచనాల్లో నిమగ్నమయ్యారు. నాలుగు పార్లమెంట్ స్థానాల పరిధిలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల లెక్కలు, ఆయా ప్రాంతాల్లో ఉన్న పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, లోపల మాత్రం ఒకింత భయం పార్టీలను వెంటాడుతున్నది.