
సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి ఉష్ణోగ్రతలను దాటి నమోదవుతున్నాయి. పగలు, రాత్రి సమయంలో కూడా ఉక్కపోత చెమటలు పట్టిస్తోంది. పదిరోజులుగా నెలకొన్న ఈ పరిస్థితితో జనం ఉక్కురిబిక్కిరవుతున్నారు. అయితే నైరుతి రుతుపవనాలు హిమాలయాల వైపు పయనమవడంతో ఇక్కడున్న తేమ ఉత్తరంపైపు వెళ్లిపోతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న తెలిపారు. దీనికి తోడు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ద్రోణిలు, ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలు ఏర్పడటం లేదన్నారు. దీని ఫలితంగా దక్షిణ భారతం మొత్తం ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు దంచికొడుతున్నట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్‌తో పాటు చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3నుంచి 4డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నట్లు డైరెక్టర్ నాగరత్న తెలిపారు. నాలుగైదు రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఈనెల 16న ఒక ద్రోణి ఏర్పడే అవకాశం ఉండడంతో 16, 17, 18తేదీలో వానలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఆమె తెలిపారు.