సిటీబ్యూరో, అక్టోబర్ 12, (నమస్తే తెలంగాణ) ః ఒమన్ వేదికగా ముసన్నా సెయిలింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు హైదరాబాద్‌లోని రెయిన్ బో హోమ్ విద్యార్థిని ఎంపికైంది. సెయిలింగ్ ఆథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి నవంబర్ 2వరకు జరిగే ముసన్నా సెయిలింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ తరుఫున పాల్గొనేందుకు 14ఏళ్ల రమీజా భాను అర్హత సాధించింది. సికింద్రాబాద్‌లోని ఆమన్ వేదిక హోమ్ ఫర్ గర్ల్స్ మేడిబావికి చెందిన రమీజా… యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాఆద్, ఇతర కోచ్‌ల సారథ్యంలో వివిధ రాష్ర్టాల్లో సెయిలింగ్ ఛాంపియన్ షిప్‌లలో సత్తా చాటింది.
తాజాగా ఒమన్ వేదికగా సాగే పోటీలకు అర్హత సాధించడంతో భారత నేవి చీఫ్ అడ్మిరల్ త్రిపాఠీ ఢిల్లీకి విద్యార్థినిని స్వయంగా ఆహ్వానించారు. భారత నేవీ చీఫ్‌ను సుహీమ్ షేక్, కోచ్ ప్రీతి కొంగర, చందన చక్రవర్తిలతో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారత నేవీ చీఫ్ అడ్మిరల్ త్రిపాఠీ విద్యార్థికి శుభాకాంక్షలు తెలపడంతోపాటు, జ్ఞాపికను అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలనీ, ఉన్నత శిఖరాలను అధిరోహించాలనీ ఆయన సూచించారు. కాగా చిన్న వయసులోనే అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని రెయిన్బో హోమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాధ, రెసిడెన్షియల్ కేర్ డైరెక్టర్ అంబిక, ఫౌండేషన్ ఇండియా బోర్డు సభ్యురాలు శ్రీలత, మేనేజర్ క్రాంతికిరణ్‌తోపాటు, ప్రాజెక్టు ఇంఛార్జీలు రమీజాను అభినందించారు.