హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో గురువారం సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నది. గురువారం హైదరాబాద్లో 20.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 17.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అంచనాల ప్రకారం.. శుక్ర, శనివారాల్లో 2.5 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
గురువారం మధ్యాహ్నం నుంచి నగరంలో పూర్తిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై, చల్లని గాలులు వీచాయి. కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అయితే గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది.