
సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌లో గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు వాన దంచికొట్టింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వాననీరు నిలవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీఎస్‌డీపీఎస్ అందించిన సమాచారం మేరకు కూకట్పల్లి, బాలానగర్‌లో అత్యధికంగా 6.8 సెం.మీ., షేక్‌పేట, బంజారాహిల్స్‌లో 6.6సె.మీ., శివరాంపల్లి, జూబ్లీహిల్స్, గన్‌ఫౌండ్రి తదితర ప్రాంతాల్లో అత్యల్పంగా 1.0సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.
నగరానికి మరోసారి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల వల్ల నేటి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈనెల 6న ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఫలితంగా రాష్ట్రంతో పాటు నగరంలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.