సిటీబ్యూరో/శంకర్పల్లి, మార్చి 30(నమస్తే తెలంగాణ) : ఓఆర్ఆర్ను అడ్డగా చేసుకొని డ్రగ్ విక్రయాలకు ప్రయత్నిస్తున్న ముఠాను మోకీల పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ బృందంతో కలిసి పట్టుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఓ రైల్వే ఉద్యోగి ఉండడం సంచలనంగా మారింది. రైల్వేలో సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగంలో ఉంటూ రెండేండ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు విచారణలో బయటపడడంతో పోలీసులు ఈ డ్రగ్ పెడ్లర్ లింక్‌లపై ఆరా తీస్తున్నారు. మోకీలా ఇన్స్పెక్టర్ వీరబాబు కథనం ప్రకారం.. సికింద్రాబాద్ రైల్వే విభాగంలో పనిచేస్తున్న పొన్నాల సిద్ధార్థ(27), సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన చలవాడి హిమాంత్ కృష్ణవంశీ, రొయ్యల వ్యాపారి అయిన అవదూత విష్ణుతేజలు డ్రగ్స్ వాడకంలో స్నేహితులుగా మారారు.
గోవా, బెంగళూరు, ముంబై నుంచి డ్రగ్ పెడ్లర్లతో వీళ్లకు పరిచయాలున్నాయి. రైల్వే ఉద్యోగి సిద్ధార్థ తరచూ ఉద్యోగానికి సెలవులు పెట్టి గోవా, బెంగళూర్‌కు వెళ్లొచ్చేవాడు. అక్కడ డ్రగ్ పెడ్లర్లతో పరిచయాలు ఏర్పడడంతో మొదట డ్రగ్‌కు అలవాటు పడి ఆ తరువాత తానే పెడ్లర్‌గా మారాడు. ఇతడికి కృష్ణ వంశీ, విష్ణుతేజలు కూడా పరిచయం కావడంతో ముఠాగా అవతరించారు. కాగా, మీర్జాగూడ మీదుగా ఓఆర్ఆర్ వైపు వస్తున్న కారును పోలీసులు ఆపారు. కారులో 40 గ్రాముల కొకైన్, 3 గ్రాముల గంజా లభ్యమైంది. పట్టుబడ్డ ముగ్గురి గూర్చి ఆరా తీయడంతో రైల్వే ఉద్యోగి ఇందులో కీలక సూత్రధారి అనే విషయం తేలింది. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.