Rail Coach Restaurant | ఫుడ్ లవర్స్‌కు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్లో కొత్తగా రైల్ కోచ్ రెస్టారెంట్‌ను దక్షిణ మధ్య రైల్వే సోమవారం ప్రారంభించింది. ఈ రెస్టారెంట్ రైలు మాదిరిగానే ఉంటూ.. ఆహార ప్రియులను ఆకర్షిస్తోంది. ఇది హైదరాబాద్ నగరంలో రెండో రెస్టారెంట్. ఇటీవలే కాచిగూడ స్టేషన్లో రైల్ కోచ్ రెస్టారెంట్ ప్రారంభమైన విషయం తెలిసిందే.
నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ నిత్యం ప్రయాణికులతో, పర్యాటకులతో రద్దీగా ఉంటోంది. ఈ స్టేషన్ చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు ఉండటంతో.. రైల్ కోచ్ రెస్టారెంట్‌కు తాకిడి ఎక్కువగా ఉంటదనే ఉద్దేశంతోనే దీన్ని అక్కడ ప్రారంభించారు. ఇందుకోసం ఉపయోగించబడని ఒక కోచ్‌ను మొత్తం రెస్టారెంట్‌గా మార్చినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. రెస్టారెంట్ అత్యాధునికంగా ఉంటుందని, మంచి అనుభూతిని కలిగిస్తుందన్నారు. ఇక రైల్ కోచ్ రెస్టారెంట్‌ను ఐదేండ్ల పాటు బూమ్రాంగ్ రెస్టారెంట్ నిర్వహించనుంది. రైలు ప్రయాణికులతో పాటు కామన్ పబ్లిక్కు కూడా రెస్టారెంట్ అందుబాటులో ఉండనుంది. కోచ్‌లోనే కూర్చొని తినొచ్చు.. లేదంటే పార్శిల్ తీసుకెళ్లొచ్చు.