జూబ్లీహిల్స్, జూన్ 19: జీహెచ్ఎంసీ 19వ సర్కిల్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజ్‌పై దౌర్జన్యం చేసిన రహ్మత్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, అతని అనుచరులను అరెస్ట్ చేయాలని జీహెచ్ఎంసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. కార్పొరేటర్.. తన అనుచరులతో కలిసి ఏఎంసీ బాలరాజ్‌పై దాడికి యత్నించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని యూసుఫ్‌గూడలోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ఎదుట గురువారం ఉద్యోగులు, సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఉద్యోగుల సంఘం నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది సర్కిల్ కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
తాను ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాలేదని ఏఎంసీ బాలరాజ్‌పై కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, అతని అనుచరులు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. డిప్యూటీ కమిషనర్ జాకియా సుల్తానా సమక్షంలో ఏఎంసీ బాలరాజ్‌పై దాడికి యత్నించడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారు. కార్పొరేటర్, అతని అనుచరుల ఆగడాలపై ఇప్పటికే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఉద్యోగులు సదరు వ్యక్తులతో ప్రాణహాని ఉందని.. వారి నుంచి రక్షణ కల్పించాలని.. వెంటనే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం శేరిలింగంపల్లిలోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడేకు వినతి పత్రం అందచేశారు.
రహ్మత్‌నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, అతని అనుచరులు దాడి చేసిన ఘటనలో జీహెచ్ఎంసీ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజ్‌కు బల్దియా ఉద్యోగ, కార్మిక సంఘాలు సంఘీభావం తెలపడంతో పాటు స్థానికంగా పార్టీలకతీతంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఉద్యోగులు నిర్వహించిన ధర్నాలో ఐఎన్టీయూసీ, బీఎంఎస్, మజ్దూర్ యూనియన్ నాయకులు, రెవెన్యూ, ఎస్సీఎస్టీ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏఎంసీ బాలరాజ్‌పై దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్, ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు. అలాగే.. రహ్మత్‌నగర్ ప్రజలు స్వచ్ఛందంగా ఏఎంసీ బాలరాజ్‌కు మద్దతు తెలిపారు. నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కాంటెస్టెడ్ కార్పొరేటర్ బండపల్లి భవానీశంకర్ ఏఎంసీ బాలరాజ్‌ను కలిసి సంఘీభావం తెలిపారు.