సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో గన్స్ విక్రయానికి ప్రయత్నిస్తున్న బీహార్ వాసిని అరెస్ట్ చేసి, మూడు కంట్రీమేడ్ పిస్టోళ్లను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బీహార్‌లోని ఔరంగబాద్, పథాన్వన్ ప్రాంతానికి చెందిన శివ్‌కుమార్ పదో తరగతి వరకు చదువుకున్నాడు.
2014లో పెండ్లి చేసుకొని గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి అక్కడ బట్టల దుకాణంలో పనిచేశాడు. 2022లో హైదరాబాద్‌కు జీవనోపాధికోసం వచ్చి పెద్దచర్లపల్లి ప్రాంతంలోని పుకట్నగర్ కాలనీలో నివాసం ఉంటూ మేడిపల్లి ప్రాంతంలోని శ్రీకర ఫర్టిలైజర్ కంపెనీలో హమాలీగా చేరాడు. ఇదే ఏడాది జనవరిలో శివకుమార్‌ను గంజాయి చాక్లెట్లు విక్రయించడంతో చర్లపల్లి పోలీసులు పట్టుకొని ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు నమోదు చేశారు.
ఈజీమనీకి అలవాటు పడి..
ఇదిలాఉండగా ఈనెల 6వ తేదీన రాఖీ పండుగకని తమ స్వగ్రామం వెళ్లాడు. అక్కడకు వెళ్లిన తరువాత తన బావ అయిన కృష్ణ పశ్వాన్తో కలిసి ఈజీగా మనీ సంపాదించేందుకు హైదరాబాద్‌లో ఆయుధాలు విక్రయించాలని ప్లాన్ చేశారు. కృష్ణ పశ్వాన్ బీహార్‌లో అక్రమాయుధాలను తయారు చేస్తుంటాడని, గతంలో ఆయుధాలు తయారు చేసే వద్ద పనిచేసి అనుభవం వచ్చిన తరువాత సొంతంగా తానే ఆయుధాలను తయారు చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.
ఇందులో భాగంగా కృష్ణ పశ్వాన్ మూడు కంట్రీ మేడ్ తుపాకులు, 10 లైవ్ రౌండ్స్ బుల్లెట్లు హైదరాబాద్‌లో విక్రయించేందుకు శివ్కుమార్కు అప్పగించాడు. ఈ క్రమంలో బీహార్ నుంచి రైల్లో హైదరాబాద్‌కు వాటిని శివ్‌కుమార్ తన వెంట తెచ్చుకున్నాడు. హైదరాబాద్‌లో వాటిని క్రిమినల్ గ్యాంగ్‌లకు విక్రయించాలని ప్ల్లాన్ చేశాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో చర్లపల్లి లా అండ్ అర్డర్ పోలీసులతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో శివ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు.
దీంతో అతని వద్ద మూడు కంట్రీమేడ్ తుపాకులు లభ్యమయ్యాయి. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న కృష్ణపశ్వాన్ కోసం గాలింపు చేపట్టారు. సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ రమాణారెడ్డి, అదనపు డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ అంజయ్య, ఇన్స్పెక్టర్లు జానయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగ, రాచకొండ కమిషనరేట్‌లో గన్ లైసెన్స్‌లు పొందిన వారి గూర్చి ఆరా తీస్తున్నట్లు సీపీ తెలిపారు.