సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఎన్డీపీఎస్ కేసుల్లో ప్రొసిజరల్ ఎక్సలెన్స్ అనే అంశంపై సోమవారం బండ్లగూడలోని జీఎస్ఐ ఆడిటోరియంలో సెమినార్, ఆ తరువాత వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనరేట్‌లోని ఇన్స్పెక్టర్, పైస్థాయి అధికారులు పాల్గొన్నారు. నిషేధిత డ్రగ్ కేసుల్లో దర్యాప్తు అధికారులకు సహకరించే హ్యాండ్ బుక్ మ్యాన్‌వల్‌ను విడుదలజేసి, వారికి అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో డ్రగ్స్ రవాణా, వినియోగం, విక్రయాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
చెక్‌పోస్టుల వద్ద తనిఖీలతో పాటు ప్రత్యేకంగా ఎస్ఓటీ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలను అణిచివేయాలని, వారిపై పీడీ యాక్టు ప్రయోగించాలని సూచించారు. యువత మత్తు పదార్థాల బారిన పడటంతో బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని, వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మత్తు పదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. నిషేధిత మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల యువతకు అవగాహన కల్పించేలా కళాశాలల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో మల్కాజిగిరి, ఎల్బీనగర్, మహేశ్వరం, ఎస్ఓటీ డీసీపీలు డి.జానకీ, సాయిశ్రీ, శ్రీనివాస్, గిరిధర్, మురళీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.