CP Sudhir Babu | సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జరిగే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేశ్ చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సూచించారు. గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై నేరేడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో పోలీసులు కమిషనర్ బుధవారం పోలీస్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గణేశ్ విగ్రహాల ప్రతిష్టాపనకు ముందు నుంచే మండపాల నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ వేడుకల్లో శాంతి భద్రతల సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని, ఇందుకు పౌర విభాగాలను సమన్వయం చేసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, నీటిపారుదల, విద్యుత్, రవాణా.. తదితర శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకోవాలన్నారు. నిమజ్జనానికి వచ్చే వారితో మర్యాదగా ఉండాలని, డయల్ 100కు వచ్చే కాల్స్‌కు సత్వరమే స్పందించాలని, సీసీటీవీలను విస్తృతంగా వినియోగించుకుంటూ విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలన్నారు. మండపాలలో డీజేలకు అనుమతి లేదన్నారు.
మండపంలో తప్పని సరిగా వలంటరీలు రోజంతా ఉండాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నాణ్యమైన విద్యుత్ పరికరాలను వాడాలని, ప్రతి గణేశ్ మండపం వద్ద విధిగా పాయింట్ బుక్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజలందరి సహకారంతో గణేశ్ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలన్నారు. సోషల్‌మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు, వదంతులు ప్రజలు నమ్మవద్దన్నారు. వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు రాజేశ్ చంద్ర, అరవింద్ బాబు, పద్మజ, ప్రవీణ్‌కుమార్, సునీతారెడ్డి, కరుణాకర్, శ్రీనివాస్, మురళీధర్, రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.