సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): నేరాలను అరికట్టడంతో పాటు నేరస్థులను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. మహేశ్వరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుమ్మలూరులోని బీటీఆర్ మాక్ ప్రాజెక్ట్‌లో రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన 328 కమ్యూనిటీ సీసీటీవీలను మంగళవారం సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కాలనీలు, కమ్యూనిటీలు ముందుకొచ్చి తమ పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పా టు చేసుకోవాలని సీపీ సూచించారు.
ప్రజా భద్రతలో భాగంగా సీసీ కెమెరాలు తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నేరం జరిగిన తరువాత బాధపడడం కంటే, నేరం జరగకుండా కట్టడి చేయడం, నేరం జరిగితే 100 శాతం నేరస్థులను గుర్తించి పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతో అవసరపడుతాయన్నారు. ఈ సమావేశంలో మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ లక్ష్మీకాంత్, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.