కాచిగూడ,జనవరి 13 : ప్రపంచంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పులు మేధావులతోనే సాధ్యమైందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) అన్నారు. బీసీ జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాముని సుదర్శన్ ఆధ్వర్యంలో సోమవారం కాచిగూడ అభినందన్ హోటల్లో రాష్ట్ర స్థాయి బీసీ లెక్చరర్స్ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ ఉద్యమం అత్యంత బలంగా ఉందని, రానున్న కాలం బీసీ రాజ్యమేనని వెల్లడించారు.
బీసీ మేధావులు బలమైన ఉద్యమం చేపడితే పాలకులు దిగివచ్చి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని పేర్కొన్నారు. బీసీలకు భిక్షం వద్దు, రాజ్యంగబద్దంగా రావాల్సిన హక్కులను కల్పించాలన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం అత్యంత బలంగా(BC slogan) ఉందని, అందుకు రాజ్యాంగాన్ని సవరించి, ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేద కులాలకు గౌరవం అధికారం ద్వారానే సాధ్యమౌతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో 32 మంది జడ్జీలు ఉన్నా..అందులో ఒక్క బీసీ కూడ లేరని ఆవేదన వ్యక్తం చేశారు.