ఖైరతాబాద్, జూలై 14 : ‘ప్రతి గ్రామంలో వంద మంది బీసీలు(BCs) చదువుకున్న వారు ఉన్నారని, వారికి పదువులు ఇవ్వాల్సి వస్తుందని’ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఓ సమావేశంలో పేర్కొన్నారు. సీఎం గారు మాకు పదువులు కాదు..రాజ్యాధికారం కావాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య(R.Krishnaiah) అన్నారు. తెలంగాణ మేధావుల సంఘం ఆధ్వర్యంలో ‘బీసీ సమాజం అభివృద్ధి-తక్షణ కర్తవ్యం’ అనే అంశంపై ఆదివారం జరిగిన అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.
స్వాతంత్య్రం వచ్చిన 76 సంవత్సరాలల్లో ఏ ఒక్క రాజకీయ పార్టీ బీసీలను పట్టించుకోలేదన్నారు.
ప్రధాని స్థాయిలో బీసీ ఉంటే సరిపోదని, ఆ విధానాలను అవలంబించాలని ప్రధాన మంత్రి మోదీని ఇటీవల పార్లమెంట్లో నిలదీశానన్నారు. రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఇవ్వమని మోదీని అడిగానని, కానీ కేవలం రూ.2వేల కోట్లు ఇచ్చారని, అది చాకెట్లు, బిస్కెట్లకు సరిపోదని ఎద్దేవా చేశారు. బీజీపీ ఎమ్మెల్యేలు గెలువడానికి ప్రధాని మోదీ బీసీ కావడమే కారణమన్నారు.
ఈ దేశంలో ప్రతి ఇంటికి రూ.20లక్షల అందించేంత బడ్జెట్ ఉందని, కాని అంబానీ, అదాని లాంటి వారి వద్దకే చేరుతుందన్నారు. ఫలితంగా ఆర్థిక వ్యత్యాసాలు వస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర కేబినేట్లో 18 మంత్రులు, బీసీలు ఇద్దరు మాత్రమే ఉన్నారని, 120 మంది ఎమ్మెల్యేలలో 21 మంది మాత్రమే బీసీలు ఉన్నారని, ఇది కనిపించని వివక్ష అని అభిప్రాయపడ్డారు. బీసీలు హక్కుల కోసం ఇక నుంచి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.