ముషీరాబాద్, మార్చి 27: బడ్జెట్లో బీసీ కార్పొరేషన్‌కు పది వేల కోట్లు కేటాయించి, ప్రతి బీసీ కుటుంబానికి రాయితీ రుణం ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఒక ప్రటనలో కోరారు. బీసీ బంధు పథకం ప్రవేశపెట్టి పది లక్షల రుణం ఇవ్వాలని, ఆర్థికంగా వెనకబడిన కులాలను ఆదుకోవాలన్నారు. 2024లో బీసీ రుణాలకోసం దరఖాస్తు 6.80 మంది బీసీలకు రుణాలు మంజూరు చేయకుండా పెండింగ్ పెట్టారని, దీంతో కుల వృత్తులు దెబ్బతింటున్నాయని తెలిపారు.
వృత్తులు కోల్పోతున్న వారికి రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు ఎలాంటి పథకాలు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, 16 బీసీ కులాల ఫెడరేషన్లకు రుణాలు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారని, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి వెంటనే రుణాలు మంజురు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న 16 బీసీ కుల ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని, ప్రతి కార్పొరేషన్‌కు పాలక మండలిని నియమించాలన్నారు.