సిటీబ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో పెంచిన బస్సు టికెట్ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు నగరంలో సిటీ బస్సు మొదటి స్టేజ్ ఫెయిర్ రూ.10 ఉంటే ఇప్పుడు రూ. 5 పెంచుతూ రూ.15 చేసింది. ఇలా మొదటి మూడు స్టేజీలకు రూ.5 అదనంగా వసూలు చేసింది. అనంతరం నాలుగో స్టేజీ నుంచి ఉన్న కనీస చార్జీపై అదనంగా రూ.10 భారం మోపింది. అంటే నాలుగో స్టేజీకి ఇప్పటి వరకు రూ. 20 ఉంటే రూ.10 అదనంతో రూ. 30 వసూలు చేసింది.
ఇలా గ్రేటర్ జోన్ పరిధిలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ , ఈ-ఎక్స్ప్రెస్ బస్సుల్లో పెరిగిన ధరలు అమలయ్యాయి. మెట్రో డీలక్స్, ఈ- మెట్రో, ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5 పెంపు, రెండో స్టేజీ నుంచి రూ. 10 అదనంగా పెంచింది. ఈ టికెట్ ధరల పెంపు నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కండక్టర్లతో ఘర్షణకు దిగారు. టికెట్ చార్జీలు ఎందుకు పెంచారంటూ నిలదీశారు. ఉచిత బస్సులాంటి పథకంతో ఆర్టీసీని ముంచుతున్నారని వాపోయారు. టికెట్ ధరలు పెంచి సామాన్యులపై భారం వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.