Pub Culture | దుండిగల్, డిసెంబర్ 21: బాచుపల్లిలో పబ్ కల్చర్ విశృంఖలంగా మారుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండానే బార్ అండ్ రెస్టారెంట్ మాటున బాచుపల్లిలో పబ్‌లను తలదన్నే రీతిలో నిర్వాహకులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా డీజే సౌండ్లతో, యువతులతో అశ్లీలంగా నృత్యాలు చేయిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. డీజే సౌండ్‌తో ఇబ్బందులు పడుతున్నట్లు ఆర్టీసీ కాలనీవాసుల ఫిర్యాదుతో బాచుపల్లి పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు ‘ఆహ్లాదం పెగ్ బ్రోబార్ అండ్ రెస్టారెంట్’పై దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా లేజర్ లైట్ వెలుగుల్లో డీజే సౌండ్ హోరు లో పలువురు యువతీయువకులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ, అసభ్యకరంగా నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు.
దీంతో మ్యూజిక్ ఈక్విప్‌మెంట్లను సీజ్ చేసిన పోలీసులు నిర్వాహకులు సూర్యం, రఘుపవన్రెడ్డి, రవికుమార్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ఇటీవల ఈ రెస్టారెంట్‌ను పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి కొలను హన్మంత్‌రెడ్డి ప్రారంభించారు.