ఘట్కేసర్, మే 19ః ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానలో ఓ సైకో యువకుడు వీరంగం సృష్టించి దవాఖాన సిబ్బందితో పాటు స్థానికులపై కత్తితో విచక్షణా రహితంగా దాడులకు పాల్పడిన సంఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఈ దాడిలో 8 మందికి పైగా స్వల్ప గాయాలు అయ్యాయి. సంచలనం సృష్టించిన సంఘటన వివరాలు ఇన్స్పెక్టర్ ఎం బాలస్వామి కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి 7 గంటలకు ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానకు గుర్తు తెలియని యువకుడు(25) తల కు తీవ్ర రక్త గాయంతో అరుస్తూ చేరుకున్నాడు.
డ్యూటి డాక్టర్ అభిషేక్ వద్దకు వెళ్లి తనకు వెంటనే కుట్లు వేయాలని బెదిరించాడు. భయాందోళనకు గురైన డాక్టర్ డ్రెస్సింగ్ గదికి తీసుకువెళ్లాడు. వెంటనే తలకు కుట్లు వేయాలని బెదిరించి అక్కడే ఉన్న వైద్యులు వాడే కత్తితో దాడికి దిగగా డ్రెస్సింగ్ చేసే వ్యక్తికి గాయమైంది. దీంతో అతను పరుగులు తీశాడు. అక్కడి నుండి నర్సు వద్దకు వెళ్లి జుట్టు పట్టుకుని తనకు కుట్లు వేయాలని లేకపోతే పొడిచి చంపేస్తానని బెదిరించాడు. సంఘటనతో భయపడిన దవాఖాన సిబ్బంది, రోగులు, వారి బంధువులు పరుగులు తీశారు.
అక్కడే ఉన్న మరో ఇద్దరిపై దాడి చేసి గాయపర్చాడు. దాడులు ఎక్కువ చేస్తుండటంతో దవాఖాన లో ఉన్న వారు తిరగబడి ప్రతి దాడికి దిగారు. వారి నుండి తప్పించుకునేందుకు అక్కడి నుండి ఎదులాబాద్ రోడ్డులో చేతిలో కత్తి పట్టుకుని బెదిరిస్తూ పరుగులు తీశాడు. ట్రాఫిక్‌లో ఉన్న ఓ కారులోకి చొరబడి బెదిరించాడు. భయాందోళనకు గురైన కారు డ్రైవరు దిగి పరుగులు తీశాడు. గమనించిన స్థానికులు ఒక్కసారిగా సైకోపై దాడికి దిగారు. దీంతో తీవ్ర గాయా లై అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సైకోను చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ దవాఖానకు తరలించారు. దాడిలో సైకో మృతి చెందినట్లు సమాచారం.