కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా ప్రకటనతో అగ్గి రాజుకున్నది. శనివారం ఉదయం ఆరోపణలతో మొదలైన ఈ వేడి.. సాయంత్రానికి గాంధీభవన్‌ను తాకింది. ఇన్నాళ్లు జెండాలు మోసిన చేతులతోనే గాంధీభవన్‌పై రాళ్లు విసిరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలకు ప్యారా చూట్ నేతలకు టికెట్లు అమ్ముకున్నాడంటూ ద్వజమెత్తారు. రేవంత్ ప్లెక్సీలు చించేయడంతో పాటు పార్టీ జెండాలను తగులబెట్టి రణరంగం సృష్టించారు. పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా.. మరికొందరు అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేశారు. జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉంటానని తేల్చి చెప్పగా.. కూకట్‌పల్లిలో టికెట్ ఆశించిన గొట్టిముక్కల వెంగళరావు కన్నీరు మున్నీరవుతూ పార్టీకి రాజీనామా చేశారు.
మహేశ్వరంలో బడంగ్‌పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మరో నేత దేప భాస్కర్‌రెడ్డిలకు రేవంత్ రెడ్డి టికెట్ ఆశ చూపి కోట్లు ఖర్చుపెట్టించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో దండెం రాంరెడ్డి అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అంబర్పేటలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన నేతలు పార్టీని వదిలే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా ఎల్బీనగర్లో అభ్యర్థి మధుయాష్కీ గౌడ్‌కు నియోజకవర్గం నేతలు జలక్ ఇచ్చారు. మహేశ్వరం టికెట్ కేఎల్ఆర్కు ఇవ్వగా.. ఇక్కడ కూడా ఆయనకు సహాయ నిరాకరణ మొదలైంది.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ)