సుల్తాన్‌బజార్, జూలై 19: హాస్టల్ ఫీజులు కట్టించుకొని 20 రోజులుగా హాస్టల్ మూసివేయడానికి నిరసిస్తూ బషీర్‌బాగ్ లోని నిజాం కళాశాల రహదారిపై కళాశాల విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ మేరకు శనివారం కళాశాల వసతి గృహం తెరిపించాలని డిమాండ్ చేస్తూ కళాశాల ప్రధాన రహదారి, బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాను స్తంభింప చేసి రహదారిపై విద్యార్థులు పెద్ద ఎత్తున బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విద్యార్థులు నిరసన తెలుపుతున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను సముదాయిం చేందుకు యత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్ ఫీజు కట్టించుకున్న కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏవీ రాజశేఖర్ 20 రోజులుగా హాస్టల్ మూసి వేశారని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే హాస్టల్ తెరిపించాలని, అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని భీష్మించుకు కూర్చున్నారు. చేసేదేమీ లేక ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కళాశాల ప్రిన్సిపాల్ తో చర్చించారు. ఈనెల 22 నుంచి హాస్టల్ ను తెరుస్తామని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏవీ రాజశేఖర్ ప్రకటించడంతో విద్యార్థులు శాంతించి ధర్నాను విరమించారు.