సిటీబ్యూరో: గౌలిపురా మున్సిపల్ కబేళాను కాపాడాలని, భూ కబ్జాదారులతో కుమ్మక్కైన బల్దియా అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆరె కటిక సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం ప్రతినిధి బృందం జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అధికారుల నుంచి వివరాలు తెప్పించుకుని వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తానని కమిషనర్ హామీ ఇచ్చినట్లు సీపీఎం నేత శ్రీనివాస్ తెలిపారు. 1955 నుంచి పహాని, రెవెన్యూ రికార్డుల్లో 4.22 ఎకరాల స్థలంలో కబేళా ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని వివరించారు.
మున్సిపల్ కబేళాను కబ్జాల నుంచి కాపాడడానికి జీహెచ్ఎంసీ వివిధ కోర్టులో ప్రయత్నిస్తున్నప్పటికీ కొందరు బల్దియా అధికారులు కుట్రపూరితంగా కబ్జాదారులకు అనుగుణంగా హైకోర్టులో ఆఫిడవిట్ వేయడంతో న్యాయస్థానం కబ్జాదారులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరించిన జీహెచ్ఎంసీ అధికారులను, స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఆరె కటిక సంఘం అధ్యక్షులు యశ్వంతరావు, ప్రధాన కార్యదర్శి రమేశ్, స్లాటర్ హౌస్ వర్కర్స్ యూనియన్ నాయకులు శివకుమార్, సీపీఎం యాకత్‌పుర జోన్ కార్యదర్శి బాలు పాల్గొన్నారు.