సిటీ బ్యూరో/బంజారాహిల్స్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బాధితులను బరిలో ఉండనీయకుండా ఎన్నికల అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ భారీ మొత్తంలో తిరస్కరిస్తూ కాంగ్రెస్‌కు వంతపాడుతున్నారు. కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా నామినేషన్ దాఖలు చేసిన ఫార్మా సిటీ, ట్రిపుల్ఆర్, నిరుద్యోగులు, వివిధ వర్గాలకు చెందిన కాంగ్రెస్ బాధితులను అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. నామినేషన్ వేస్తున్నప్పుడే పత్రాలన్నీ సరిగ్గా ఉన్నా కూడా రైతులు, నిరుద్యోగుల, వివిధ సంఘాల నేతలను ప్రత్యేకంగా గుర్తించి పత్రాలను తీసుకునేందుకు నిరాకరించారు. అయినా 211 నామినేషన్లు రావడంతో కాంగ్రెస్ అభ్యర్థికి నష్టం జరుగుతుందని భావించి స్క్రూటినీ పేరుతో భారీగా తిరస్కరించి చివరకు 81 మందిని అర్హులుగా ప్రకటించారు.
ప్రాధాన్యం లేని కాలమ్స్ ఖాళీగా ఉన్నాయనే నెపంతో రైతులు, నిరుద్యోగులు, కాంగ్రెస్ బాధితుల నామినేషన్లు చెల్లుబాటు కాకుండా చేశారు. ఎన్నికల అధికారుల తీరుపై ఆగ్రహించిన అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ అధికారి సహా నామినేషన్ల స్వీకరణలో విధులు నిర్వహిస్తున్న ప్రతి అధికారి కాంగ్రెస్ ప్రభుత్వానికి తలొగ్గి పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులుగా ఉండి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతల ఒత్తిడి వల్లనే నిబంధనలకు విరుద్ధంగా అధికారులు పనిచేస్తున్నారని విమర్శించారు. నిబంధనలు పాటించకుండా తమ నామినేషన్లను తిరస్కరించడంపై కోర్టుకు వెళ్లి నాయ్యపోరాటం చేస్తామని వెల్లడించారు.
ఎన్నికల నియమావళి రైతులకు మాత్రమే వర్తిస్తుందా? కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు వర్తించవా? అంటూ తిరస్కరణకు గురైన బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఫార్మాసిటీ భూ బాధిత రైతుల తరఫున 20 మంది నామినేషన్ దాఖలు చేయగా ఒక్కటంటే ఒక్కటి కూడా ఆమోదించ లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు ఫార్మాసిటీ బాధిత రైతులకు ఇచ్చిన హామీలను, చేసిన మోసాన్ని జూబ్లీహిల్స్ ప్రజల ముందు ఉంచుతారనే భయంతోనే తిరస్కరించారని ఆరోపిస్తున్నారు. తమ నామినేషన్ల తిరస్కరణకు కారణాలేంటని ప్రశ్నిస్తే ఎమ్మార్వో అనితారెడ్డి నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రిటర్నింగ్ అధికారి తమ నామినేషన్ల తిరస్కరణకు కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొన్ని కాలమ్స్ ఖాళీగా ఉండటం వల్ల రిజెక్ట్ చేశామని చెప్తున్నారని వాపోయారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ పత్రాల్లో మాత్రం కాలమ్స్ ఖాళీగా ఉంటే ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులే నింపి నామినేషన్‌ను ఆమోదించారని, కాంగ్రెస్ అభ్యర్థికి ఒక న్యాయం, కాంగ్రెస్ బాధిత రైతులకు మరో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. ఆర్వో ఎలాంటి సమాధానం చెప్పకపోగా అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్లాలని సూచించారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లోనే ఎన్నికల అధికారులు పనిచేస్తున్నారని మండిపడుతున్నారు. బుధవారం ఉదయం ప్రారంభమైన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం గురువారం తెల్లవారుజామున 3 గంటల దాకా కొనసాగింది. మొత్తం 321 నామినేషన్లను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి వాటిలో 135 నామినేషన్లు సరైనవిగా తేల్చారు. 186 నామినేషన్లను తిరస్కరించారు. అందులో 211 మంది అభ్యర్థులలో 81 మంది నామినేషన్లకు ఆమోదం తెలిపారు.
130 మంది నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. కాగా సరైన కారణాలు లేకుండానే తమ నామినేషన్లను ఎలా తిరస్కరిస్తారంటూ రాత్రంతా పలువురు అభ్యర్థులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి నామినేషన్లలో లోపాలున్నా, వాటిని ఆమోదించిన రిటర్నింగ్ అధికారి తమ నామినేషన్లను తిరస్కరించారని మాల సంఘాల జేఏసీ నేత చెరుకు రామచందర్ ఆరోపించారు. కనీసం లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ఆందోళనకు దిగారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన రిటర్నింగ్ అధికారి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ రాజ్యంగం కల్పించిన తమ హక్కులను హరించారని, ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తామని రామచందర్ హెచ్చరించారు.