సిటీబ్యూరో, జూన్17(నమస్తే తెలంగాణ): పురుషులు అత్యధికశాతం బాధపడే కాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 2022 ఏడాదిలో 1.4 మిలియన్లకు పైగా కొత్త కేసులు నమోదు కాగా, 3.96 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 2040 నాటికి ఈ సంఖ్య 2.4 మిలియన్ కేసులతో పాటు 7.12 లక్షల మరణాలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. భారతదేశంలో ఉండే పురుషుల్లో వ్యాపించే క్యాన్సర్ రోగంలో ఇది 2వ అతిపెద్ద ముప్పుగల క్యాన్సర్‌గా మారింది. 2020లోనే దాదాపు 40వేల కొత్త కేసులు నమోదయ్యాయి. జీవితకాలం పెరగడం, పట్టణ జీవనశైలి, స్కీన్రింగ్ టెస్టుల లేమి కారణంగా ఇది వేగంగా పెరుగుతోంది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో అత్యధిక కేసులు నమోదు అయినట్లు సమాచారం.
వ్యాధి లక్షణాలు..
ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులలోని ప్రోస్టేట్ గ్రంధిలో మొదలవుతుంది. ప్రారంభ దశలో లక్షణాలు కనిపించపోయినా గుర్తించకుంటే చివరకు ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో మూత్రవిసర్జనలో ఇబ్బందులు, మూత్రప్రవాహం బలహీనంగా ఉండటం, మూత్రం లేదా వీర్యంలో రక్తం రావడం, శుక్లస్రావ సమయంలో నొప్పి లేదా లైంగిక నిర్జీవత్వం ఏర్పడటం, వెన్ను, నడుము ఛాతీ నొప్పితో బాధపడటం, వయస్సు పెరిగే ప్రతి పురుషుడికి ఇవి సాధారణం అనిపించినా, పలుసార్లు క్యాన్సర్‌కు కారణం కావొచ్చు.
నిర్లక్ష్యం చేయొద్దు…
50 ఏళ్లు పైబడిన వారిలోనే ఈ రోగం అధికంగా ఉండటం గమనార్హం. అనేక మంది పురుషులు నిర్లక్ష్యంతో స్కీన్రింగ్ కు దూరంగా ఉంటారు. కానీ ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స అందించవచ్చు. రోగాన్ని నిర్ధారించడానికి డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్, ప్రోస్టట్ స్పెసిఫిక్ అంటీజన్ రక్త పరీక్ష, ప్రోస్టేట్ బయాప్సీ, ఎంఆర్ఐ, బోన్ స్కాన్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల్లో రోగం నిర్ధారణైతే రోబోటిక్ ప్రోస్టేటోమీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ.కీమోథెరపీ, ఇమ్యునోథెరపీలాంటి వైద్యచికిత్సలందిస్తారు.
ప్రారంభదశలో గుర్తిస్తే నయం చేయొచ్చు
ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స చేసి నయం చేయొ చ్చు. 50 ఏళ్ల వయస్సు గల వాళ్లు అయితే లేదా కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి ఉంటే, తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించండి. ప్రతి సంవత్సరం పీఎస్ఏ టెస్ట్, మూత్రపరీక్ష, అల్టాస్రౌండ్ చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని తొందరగా గుర్తించి ప్రాణాలు కాపాడుకోవచ్చు.
– డాక్టర్ ఏవీ కళ్యాణ్ కుమార్,యూరాలజీ అండ్ అండ్రాలజీ కన్సల్టెంట్, స్టార్ హాస్పిటల్