మేడ్చల్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : మున్సిపాలిటీల్లో నిధుల కొరత కారణంగా ఆస్తి పన్నులు పెంచేందుకు ఆదాయం రాబట్టాలని సర్కారు యోచిస్తున్నది. ఇందుకోసం భువన్ సర్వే చేసేందుకు మున్సిపల్ అధికారుల ప్రణాళిక సిద్ధమైంది. గతంలో నిర్మించుకున్న ఇళ్లపై అదనపు అంతస్తులు, గదులు నిర్మించుకున్న వారికి పాత ఆస్తి పన్నులే వస్తున్నాయి. తీవ్రమైన నిధుల కొరత వల్ల మున్సిపాలిటీల్లో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోయాయి. ఈ క్రమంలో ఆదాయ మార్గంపై ప్రభుత్వం దృష్టిపెట్టిన ప్రభుత్వం భువన్ సర్వే చేసి ఆ తర్వాత ట్యాక్స్‌లు పెంచనున్నది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 16 మున్సిపాలిటీలు ఉండగా పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్‌నగర్, నిజాంపేట్ కార్పొరేషన్లు కాగా మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, పోచారం, ఘట్కేసర్, నాగారం, దమ్మాయిగూడ, దుండిగల్, కొంపల్లి, మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఆర్థిక సంవత్సరం రూ.430 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అయితే భువన్ సర్వే వల్లే మరో రూ.60 కోట్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని మున్సిపల్ అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే ఇప్పటికే ఉన్న ఇళ్లపై కొత్తగా నిర్మించిన అదనపు అంతస్తుల వివరాలను సేకరిస్తున్నారు. వాటి ఆధారంగా సర్వే చేసి కొలతల ద్వారా ఆస్తి పన్నులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించేందుకూ నిధులు లేకపోవడంతో ప్రజల సమస్యలనైనా పరిష్కరించేందుకు అవసరమైన ఆదాయం కోసం భువన్ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే ప్రస్తుతం ప్రత్యేక పాలన కొనసాగుతున్న క్రమంలో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక పాలనలో మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి.