సైదాబాద్, జనవరి 8 : కరణ్బాగ్ కాలనీలో కొలువుదీరిన మల్లికార్జున ఆలయం మల్లన్నస్వామి కల్యాణ మహోత్సవాల (జాతర)ను వైభవంగా నిర్వహించటానికి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. కొమరవెల్లి, ఐనవోలు ప్రాంతంలో వెలిసిన మల్లన్నస్వామి తమ ప్రాంతంలో వెలియడంతో స్థానికులు పుట్టమన్ను మల్లన్నస్వామిగా పూజిస్తున్నారు. కొమరవెల్లిలో జరిగే పూజలన్నీ కొనసాగుతుండటంతో అక్కడికి వెళ్లలేని భక్తులందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్నారు.
కల్యాణ మహోత్సవ కార్యక్రమాల వివరాలు
ఈ నెల 11వ తేదీ బుధవారం ఉదయం 5గంటలకు మేలుకొలుపు, అభిషేకం, యజ్ఞం, సత్యనారాయణ వ్రతం, శ్రీమల్లన్నస్వామి వారి ఊరేగింపు, గురువారం స్వామివారి మేలుకొలుపు, అభిషేకం, అర్చనలు, శ్రీబలిజ మేడలదేవి, గొల్ల కేతమ్మ సమేత శ్రీ మల్లన్న స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పటం, అగ్ని గుండాలు, గొలుసు తెంపటం, ఒగ్గు పూజారులకు, శివశక్తులకు సన్మానం, మల్లన్నస్వామి ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహిస్తారు. శుక్రవారం సాయంత్రం శ్రీ రేణుకా ఎల్లమ్మ శ్రీనల్లపోచమ్మ, శ్రీమహాంకాళి అమ్మవార్లకు బోనాలు, ఒడిబియ్యం పోయటం, ముత్తయిదువులకు పసుపు, కుంకుమ, కొత్త గాజులు అందజేయనున్నారు.
కల్యాణం, జాతరకు ఏర్పాట్లు పూర్తి
శ్రీమల్లన్నస్వామి కల్యాణ మహోత్సవం (జాతర) ను వైభవంగా నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఆలయానికి రంగులు వేసి, రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఆలంకరించాం. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశాం. నిబంధనలు పాటిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకోవాలి.
– వీఎన్వీ సత్యనారాయణ, ఆలయ కార్యనిర్వహణాధికారి