హఫీజ్‌పేట్, అక్టోబర్ 29: ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ విద్య, పరిశోధనలకు కేంద్రమేగాకుండా, సతత హరిత శ్రేయస్సే లక్ష్యంగా కృషి చేస్తుందని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయ ఉప కులపతి డాక్టర్ ప్రవీణ్ రావు అన్నారు. దేశంలోనే అతి పెద్ద బయో అగ్రి సదస్సు 2021 మాదాపూర్‌లోని వెస్టిన్ హోటల్లో గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ప్రవీణ్‌రావు…భారతదేశంతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన 150 మంది బయో అగ్రి నిఫుణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బయో ఇన్నోవేషన్స్ ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, విశ్వ విద్యాలయాలలో అంతర్గత పరిశోధనలు ప్రేరేపించేలా ఎంఓయూలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. త్వరలో జయశంకర్ వర్సిటీ, బయో అగ్రి ఇన్పుట్ ప్రొడ్యూసర్ మధ్య అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. బీపా అనేది లాభాపేక్షలేని సంస్ధ, ఇందులో బయో పెస్టిసైడ్స్, స్టిమ్యులెంట్లు, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్తో పాటు భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా స్థిరమైన వ్యవసాయం కోసం జీవ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కోసం పనిచేస్తుందని బయో అగ్రి ఇన్పుట్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కేఆర్కే రెడ్డి అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి వెంకటేశ్ దేవనూర్, వర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్లు జగదీశ్వర్, వెంకటేష్ పాల్గొన్నారు.