Gaali Vinod Kumar | ఉస్మానియా యూనివర్సిటీ : జాతీయ విద్యా విధానం పేరుతో హిందీని బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలపై రుద్దితే తిరుగుబాటు తప్పదని దక్షిణాది జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ హెచ్చరించారు. ఉత్తర భారత దేశ పార్టీ అయిన బిజెపి ఆధిపత్య కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది భాష హిందీని దక్షిణాదిపై రుద్దాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
తార్నాకలోని జేఏసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. జనాభా దామాషా పద్ధతిలో బడ్జెట్ కేటాయిస్తూ దక్షిణాదికి తీవ్ర ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాదికి వేస్తున్న శిక్షగా దీనిని అభివర్ణించారు. 2026వ సంవత్సరంలో జరిగే డిలిమిటేషన్ ద్వారా దాదాపు 30 పార్లమెంటు స్థానాలు దక్షిణ భారతదేశం కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాది ప్రజలు ఇప్పటికైనా మేలుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. బడ్జెట్లో నిధులు, ఆత్మగౌరవం సైతం కోల్పోతామని వాపోయారు. దక్షిణాదికి ద్రోహం చేస్తున్న బిజెపిపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్లు సంజీవరావు, ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.