Congress Govt | సిటీ బ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి స్పష్టత కొరవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 15 నెలలు కావొస్తున్నా పథకాల అమలులో పూర్తిగా వైఫల్యం చెందడమే కాకుండా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. హైదరాబాద్‌లోని వేలాది మంది ప్రజలు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు ఒక్కొక్కరు ముడు నుంచి ఐదు సార్లు దరఖాస్తు చేసుకున్నారు.
అధికారులు దరఖాస్తులు తీసుకోవడమే కాని.. వారికి ఎలాంటి రశీదులు ఇవ్వడం లేదు. అదేమిటని ప్రశ్నిస్తే.. తమకున్న అధికారం దరఖాస్తులు తీసుకోవడం వరకే అని చెప్పడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు తమకు వస్తాయా? రావా? వస్తే ఎప్పుడిస్తారు? అనే ప్రశ్నలతో సతమతమవుతున్నారు. గృహజ్యోతి పేరుతో 2 00 యూనిట్ల కరెంట్ ఉచితమని ప్రకటించి కొంతమందికే వర్తింపజేసింది.
గృహలక్ష్మి పేరిట రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని.. మిగతా డబ్బు లబ్ధిదారుల ఖాతాలో వేస్తామని చెప్పారు. సబ్సిడీ డబ్బులు మూడు నెలలుగా రావడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పథకంలో ఏదో ఒక సమస్య ఉండటంతో జిరాక్స్ పేపర్లు పట్టుకుని ప్రజలు కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల అటు ప్రజలు.. ఇటు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికారంలోకి రాగానే రూ.500 కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మూన్నాళ్ల ముచ్చటగా మారింది. గడిచిన మూడు నెలలుగా సబ్సిడీ డబ్బులు ఖాతాలో జమకావడం లేదని ప్రజలు నిట్టూరుస్తున్నారు. చేసేదేమీలేక గ్యాస్ బుక్కులు, ఆధార్, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్‌లతో నగర ప్రజలు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. సబ్సిడీ డబ్బులు రాకపోతే తామేమీ చేయలేమని అధికారులు చెబుతున్నారని వాపోతున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం గృహ లక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారని ప్రజలు చెబుతున్నారు.
పేద ప్రజలందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ చెప్పుకుంటున్నది. కానీ తమకు వందలాది రూపాయల కరెంట్ బిల్లు వస్తుందని ప్రజలు కలెక్టరేట్‌కు చేరుకుంటున్నారు. ఆధార్ కార్డులు, 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుతున్నట్లు రశీదులు తీసుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు ఉచిత విద్యుత్ పథకం వర్తించడంలేదంటే రకరకాల కారణాలు చెబుతున్నారని వాపోతున్నారు. తమ కంటే ఎక్కువ విద్యుత్ వాడేవారికి ఉచితంగా ఇస్తూ తమకు వందల్లో బిల్లులు వేస్తున్నారని వాపోతున్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు తీసుకుంటున్న అధికారులు రశీదులు ఇవ్వకపోవడంతో మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రతి సోమవారం ప్రజావాణికి వేలాదిగా తరలివస్తున్నారు. అది గాక మిగతా రోజుల్లోనూ అర్జిలు వస్తున్నాయని కలెక్టరేట్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రకటనలు చేయడం తప్ప ఇందిరమ్మ ఇండ్ల పంపిణీని ఆచరణలోకి తీసుకురావడం లేదని ప్రజలు వాపోతున్నారు. మరోవైపు అర్హులను గుర్తించకముందే ఇందిరమ్మ ఇండ్లు మొదలు పెట్టిన వారికి రూ.లక్ష అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
రేషన్ కార్డుల దరఖాస్తుల్లో విప్పలేనన్ని చిక్కుముడులున్నాయని అర్జి దారులు వాపోతున్నారు. గతంలో చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటం వల్ల కొత్తవాటిని మీసేవ ఆన్లైన్లో తీసుకోవడం లేదని అంటున్నారు. అప్పట్లో నవ దంపతులు చేసుకున్న దరఖాస్తులు ఇప్పటిదాకా వెబ్సైట్లో ఉండటంతో ఇటీవల పుట్టిన తమ పిల్లల పేర్లు నమోదు కావడంలేదని అంటున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న మహిళల పేరు తమ పుట్టింటి రేషన్ దుకాణంలో తొలగించినా సివిల్ సప్లై సర్వర్‌లో తీసేయకపోవడంతో అత్తగారింటి రేషన్ కార్డులో నమోదు కావడంలేదంటున్నారు. ఒంటరి, భార్య చనిపోయిన పురుషుల రేషన్ కార్డులు దూరమవుతున్నాయని వాపోతున్నారు.
ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును తూతూ మంత్రంగా చేపడుతుండటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పథకాల రూపకల్పన, అమలుకు సంబంధించిన మార్గదర్శకాల్లో స్పష్టత లేకపోవడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోజుకో ప్రకటన చేయడమే తప్ప.. ఆచరణలో చూపించకపోవడంతో ఇబ్బందులు ఎదురవతున్నాయి. ప్రజలు నిత్యం పనులు మానుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.