ఖైరతాబాద్, డిసెంబర్ 20 : నిమ్స్ సెక్యూరిటీ గార్డుల జీవితాలతో ప్రైవేట్ ఏజెన్సీలు చెలగాటమాడుతున్నాయి.సమయానికి వేతనాలు చెల్లించకపోవడంతో సెక్యూరిటీ గార్డులు అవస్థలుపడుతున్నారు. నిమ్స్ దవాఖానలో 300 మందికిపైగా సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా వారి కష్టాలు తీరని సమస్యగానే మిగిలిపోతోంది. పదేండ్ల కిందట రేణుకా సెక్యూరిటీ ఏజెన్సీ ఏకంగా కోట్లాది రూపాయల పీఎఫ్ డబ్బులు ఎగ్గొట్టి ఆస్పత్రి నుంచి మకాం మార్చేసింది. అయినా యాజమాన్యం పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపించాయి.
ఆ తర్వాత వచ్చిన ఏజెన్సీలన్నీ సరైన సమాయానికి వేతనాలు ఇవ్వకుండా, సెలవులను కేటాయించకుండా, లీవులను పరిగణంలోకి తీసుకోకుండా జీతాల్లో కోతలు సైతం విధించి వేధించాయి. తాజాగా ఓం సాయి ప్రొఫెషనల్ డిటెక్టీవ్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీ ఏడాది కాలంగా రెండు నెలలు, మూడు నెలలకోసారి వేతనాలు ఇచ్చి వేధింపులకు పాల్పడింది. పీఎఫ్ డబ్బులను సైతం జమా చేయకుండా, చివరకు ఈ ఏడాది జూన్‌లో కాలపరిమితి తీరడంతో నిమ్స్‌ను వీడింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలతో పాటు జూన్‌లోని పది రోజుల కాలానికి వేతనాలను ఎగ్గొట్టింది. చేసేదేమీ లేక సెక్యూరిటీ గార్డులు లేబర్ కమిషనర్‌ను ఆశ్రయించారు. అక్కడ వారికి తక్షణ న్యాయం జరుగకపోవడంతో విషయాన్ని డైరెక్టర్ దృష్టికి తీసుకురాగా, లేబర్ కమిషనర్ వద్దే తమ సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చినట్లు సెక్యూరిటీ గార్డులు వాపోయారు.
ఆ ఏజెన్సీలకే బాధ్యతలు
నిమ్స్‌లో బాధ్యతలు తీసుకున్న ఏజెన్సీలన్నీ దాదాపుగా సెక్యూరిటీ గార్డులను వేధించినవే. వేతనాలను ఎగ్గొట్టడంతో పాటు పీఎఫ్ డబ్బులను జమా చేయకుండా మోసగించినవే అధికంగా ఉన్నాయి. తాజాగా, ఓపీడీఎస్‌ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీ గతంలోనే ఓ సంస్థకు సంబంధించిన మూడు కోట్ల పీఎఫ్ డబ్బులు గోల్మాల్ చేసిందన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపించాయి. అయినప్పటికీ అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏజెన్సీలకే నిమ్స్ బాధ్యతలు ఎలా వస్తున్నాయన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది. డైరెక్టర్ ప్రమేయం లేకుండా వారికి బాధ్యతలు ఎలా వస్తాయని సెక్యూరిటీ గార్డులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ స్పందించి తమ సమస్యలను యాజమాన్యం పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని, మోసగించిన ఏజెన్సీలపై విచారణ జరిపించాలని సెక్యూరిటీ గార్డులు కోరుతున్నారు.