శామీర్పేట, సెప్టెంబర్ 19: ఆధునిక అవసరాలకు ఖైదీల దిద్దుబాటు చేసేందుకు అనుగుణంగా బలమైన ప్రగతి శీల చట్టం ద్వారా ఆధునీకరణ జరగాలని కేంద్ర ప్రభుత్వం మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్-2023ను తీసుకువచ్చిందని తెలంగాణ రాష్ట్ర ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా అన్నారు.
నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయం సెంటర్ ఫర్ చైల్డ్ అండ్ యూత్ జస్టిస్ – తెలంగాణ రాష్ట్ర జైళ్ళశాఖ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్-2023 అడాప్షన్పై సంప్రదింపుల వర్క్షాప్ను గురువారం నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మిశ్రా మాట్లాడుతూ ఖైదీల చట్టం-1900 వందేండ్ల పాతది.
కాబట్టి ఈ చట్టాల ఆధునీకరణ, అవసరాలకు అనుగుణంగా ఖైదీలకు దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు అనుగుణంగా బలమైన ప్రగతి శీల చట్టం ద్వారా అధునీకరణ జరగాలని, అందుకు కేంద్రం మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్-2023ను తీసుకువచ్చిందన్నారు. దేశంలోని జైళ్ళను నియంత్రించే ప్రస్తుత చట్టాలు ‘ది ప్రిజన్స్ యాక్ట్’ వారి అధికార పరిధిలో జైలు చట్టాన్ని సవరించడంలో మోడల్ చట్టంలో అందించిన మార్గదర్శకాలను ఉపయోగించుకోవాలని హోమ్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించిందన్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం, రాష్ట్ర జాబితా దీనిని అనుసరించి ‘తెలంగాణ రాష్ట్ర జైళ్ళ శాఖ – నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా’ మార్గదర్శకత్వంతో తెలంగాణ రాష్ర్టానికి నమూనా చట్టాన్ని ఆమోదించే ప్రక్రియలో ఉందన్నారు. నల్సార్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 300ల చట్టాలు, నియమాల, నిబంధనల ముసాయిదా, సమీక్షలో ప్రభుత్వానికి సహకరించిందన్నారు. నేడు మొదటి సెషన్లో తెలంగాణ కోసం మోడల్ జైళ్ళ చట్టం-2023 యొక్క తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం చేర్పులు చేసుకోవడం, చట్టంపై సమీక్ష, విధి విధానాలపై చర్చించడం జరిగిందన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా, ప్రిజన్స్ ఐజీ వై.రాజేశ్, ప్రిజన్స్ వెల్ఫేర్ ఐజీ మురళీబాబు, డీఐజీలు శ్రీనివాస్, సంపత్, నల్సార్ రిజిస్టార్ ప్రొఫెసర్ ఎన్.వాసంతి, సెంటర్ ఫర్ చైల్డ్ అండ్ యూత్ జస్టిస్ కో ఆర్డీనేటర్, క్రిమినల్ లా ఫ్యాకల్టీ డాక్టర్ బాలకృష్ణ, ప్రొఫెసర్లు కేశవరావు, కేవీకే శాంతి, డాక్టర్ మల్లికార్జున్, మురళీకర్ణం, రోస్మీజోన్, జైలు అధికారులు పాల్గొన్నారు.