మలక్‌పేట, జనవరి 20: అంధత్వ నివారణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం మూసారాంబాగ్ డివిజన్లోని శ్రీపురం కాలనీ, పాత మలక్‌పేట డివిజన్లోని ప్రిన్స్ బాడీగార్డ్ లేన్, ఆజంపురా డివిజన్లోని ఝట్పట్ నగర్, సాలార్ యే మిల్లత్ కమ్యూనిటీ హాళ్లలో నిర్వహించిన కంటి వెలుగు కేంద్రాలను ఎమ్మెల్యే బలాలతో కలిసి హోం మంత్రి మహమూద్ అలీ పరిశీలించారు. శిబిరాల్లో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు, కండ్లద్దాల పంపిణీ తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కంటి పరీక్షల కోసం వచ్చే ప్రతి రోగిని పరీక్షించాలన్నారు. అవసరమైన వారికి కండ్లద్దాలు ఇవ్వాలన్నారు.
చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ కంటి వెలుగు శిబిరాలకు వచ్చి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ బిర్జిస్ ఉన్నీసా, శాలివాహననగర్ పట్టణ ఆరోగ్యకేంద్రం డాక్టర్ తరుణ్ శివరాం, కంటివెలుగు మెడికల్ అధికారి శిల్ప, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనితానాయక్, డైరెక్టర్లు రాము, నరేష్, మాజీ కార్పొరేటర్ సునరితారెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రఘునందన్‌రెడ్డి, టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి నాగరాజు, ఎంఐఎం నాయకులు కనుకుల రవీందర్‌రెడ్డి, షఫీ, ఆశ వర్కర్లు అపర్ణ, మంజుల, నారాయణమ్మ, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.