ఖైరతాబాద్, సెప్టెంబర్ 3: పైసా పైసా కూడబెట్టి కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను ఎఫ్టీఎల్లో ఉందంటూ ప్రభుత్వం ఆక్రమించుకోవడం అన్యాయమని సైట్ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ సదానందం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము యూస్ఫ్గూడలో ఉద్యోగం చేస్తున్నప్పుడే 1985లో రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, గుట్టలబేగంపేట గ్రామంలో సర్వే నంబర్లు 12, 13లో 80 ప్లాట్లను కొనుగోలు చేశామని, 1989లో రిజిస్ట్రేషన్ సైతం చేసుకున్నామన్నారు.
హుడా సైతం ఈ స్థలాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అప్రూవల్ ఇచ్చిందని, తమ స్థలంలోని రెండున్నర ఎకరాలను గ్రీన్ బెల్ట్ కోసం వదిలేశామన్నారు. అందులో కొందరు ఇంటి నిర్మాణాలు సైతం చేసుకున్నారని, మరికొందరు తాత్కాలికంగా షెడ్లు, కాంపౌండ్ వాల్లను నిర్మించుకున్నారన్నారు. గతంలో ఓ అధికారి వచ్చి తనకు కోటి రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో తమ స్థలం సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని డ్రాఫ్ట్ రాస్తానని బెదిరించాడని అందుకు తాము నిరాకరించడంతో చెరువుతో సంబంధం లేని తమ స్థలాన్ని ఎఫ్టీఎల్లో చేర్చారని ఆరోపించారు.
హైడ్రా పేరుతో తీవ్ర అన్యాయం..
గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన హైడ్రా తమకు తీరని అన్యాయం చేసిందన్నారు. ఇరిగేషన్ రికార్డులో చెరువు 15 ఎకరాల్లో ఉందంటే, రెవెన్యూ రికార్డులు 24 ఎకరాలు అంటున్నదని, చివరకు హైడ్రా 30 ఎకరాల్లో ఉందని అంటూ వెంటనే ప్లాట్లను ఖాళీ చేయాలని ఆదేశించిందన్నారు. సున్నం చెరువు సర్వే నం.30లో ఉందని, తమ సర్వేకు దానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. సున్నం చెరువు అనేది చెరువుగా కాకుండా సుద్దలవాణికుంటగా ఉందని, ఇది అధికారులకు సైతం తెలుసన్నారు.
ఓవైసీని వదిలి బలహీనులపై ప్రతాపం..
చెరువుల్లో నిర్మాణాలు చేసిన ఎంఐఎం పార్టీ లీడర్ ఓవైసిని వదిలి బలహీనులమైన తమ స్థలాలను ఎఫ్టీఎల్ పేరిట లాక్కోవడం అన్యాయమన్నారు. దీనిపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా.. స్టేటస్ కో ఇచ్చిందని, అయినా కోర్టు ధిక్కారానికి పాల్పడుతూ తమ స్థలంలో నిర్మాణాలను పోలీసుల పహార మధ్య కూల్చివేసిందన్నారు. జీవితకాలమంతా కష్టపడి కూడబెట్టుకొని ఇండ్లు నిర్మించుకుందామనుకుంటే ఈ ప్రభుత్వం నిలువ నీడలేకుండా చేస్తుందన్నారు. ఇప్పటికైనా తమ స్థలాలను తమకు అప్పగించాలని, లేనిపక్షంలో న్యాయపోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఈ సమావేశంలో సొసైటీ ప్రతినిధులు డాక్టర్ సాంబశివరావు, రాజేంద్ర ప్రసాద్, నవీన్, ప్రభాకర్, జయశ్రీ, నాగేందర్, శ్రీనివాసరావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.