సిటీబ్యూరో, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ) : ఎలివేటెడ్ బాధితుల బతుకులు ఆగమ్యగోచరంగా మారాయి. సర్కారు పరిహారం తేల్చకుండానే ఓవైపు వేధింపులకు గురిచేస్తూనే, మరోవైపు టీడీఆర్ రూపంలో పరిహారం కట్టబెట్టేలా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సర్కారు చర్యలపై ఆందోళనకు గురవుతున్న బాధితులు.. పాత ధరలతో తమకు తీరని నష్టం జరుగుతుందని, మార్కెట్ ధరలకు అనుగుణంగా నగదు రూపంలోనే పరిహారం తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
కోర్ సిటీ నుంచి నార్త్ తెలంగాణకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు బాధితులను నిండా ముంచేలా కాంగ్రెస్ సర్కారు మార్చేసింది. ఇప్పటికే భూసేకరణకు నోటిపికేషన్ జారీ చేసి, కొంత మందికి పరిహారం చెక్కులను అందజేసిన సర్కారు.. తాజాగా ఇకపై పరిహారాన్ని టీడీఆర్ రూపంలోనే చెల్లించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
ఈ క్రమంలోనే టీడీఆర్ వినియోగం పరిధిని హెచ్ఎండీఏ లిమిట్స్ వరకు విస్తరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ పరిహారం విషయంలో బాధితుల డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు టీడీఆర్ బాండ్ల రూపంలో దాదాపు 1500మందికి పరిహారం కట్టబేట్టేందుకు సన్నద్ధం అవుతుంది.
అయితే టీడీఆర్ బాండ్ల జారీలో సబ్ రిజిస్ట్రార్ ధరలను ప్రామాణికంగా తీసుకుని మంజూరు చేస్తారు. కోల్పోతున్న స్థలానికి 300-400 శాతం చొప్పున బాండ్లను ఇవ్వాలనేది ఉంది. అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్ ధరలను 20-30శాతం మేర పెంచింది. వీటికి అనుగుణంగా కంటోన్మెంట్ పరిధిలోనూ భూముల ధరలు మారిపోవాలి. కానీ పరిహారం విషయంలో సర్కారు జనాలకు ప్రయోజనాలకు అందకుండా ఎస్ఆర్వో విలువను సవరించకుండా.. ఈ ప్రాంతంలో గజానికి రూ.55 వేలుగానే ఉంచింది.
ఈ లెక్కన సర్కారు టీడీఆర్ బాండ్లను గానీ, నగదు రూపంలో ఇచ్చే పరిహారాన్ని కూడా పాత భూముల ధరల లెక్క గట్టి చేతులు దులుపుకొంటుంది. ఇదే గనుక జరిగితే తమకు తీరని నష్టం అవుతుందని, ముఖ్యంగా కోల్పోతున్న భూముల ధరల బహిరంగ మార్కెట్ ధరలతో పోల్చితే 10రెట్లు ఎక్కువగా ఉందని, రెంటల్ ఇన్కం అంతకు మించి ఉందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా బాధితులను ఇబ్బందులకు గురిచేయకుండా, న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే…బహిరంగ మార్కెట్ ధరలకు అనుగుణంగా పరిహారాన్ని నగదు రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుండా టీడీఆర్ రూపంలో ఇచ్చినట్లు అయితే భూసేకరణకు తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేస్తున్నారు. కనీసం మార్కెట్ ధరలను సవరించి జరుగుతున్న నష్టానికి సముచితమైన పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
టీడీఆర్ పరిహారం విషయంలో సర్కారు పునరాలోచన చేయాలి. ఎందుకంటే ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు వలన సర్వం కోల్పోతున్న వారికి సర్కారు ఇచ్చే పరిహారంతో ఏమాత్రం ప్రయోజనం లేదు. నగదు రూపంలో ఇచ్చిన, భూముల ధరలను సవరించకపోవడంతో తీరని నష్టం జరుగుతుంది. ఇప్పుడు టీడీఆర్ రూపంలో పరిహారం ఇచ్చే ప్రతిపాదనలతో బాధితులకు సర్వం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే సర్కారు పరిహారం విషయంలో అందరికీ ఒకే రీతిగా పరిహారాన్ని లెక్కించి, నగదు రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది.
– తేలుకుంట సతీశ్ కుమార్ గుప్తా