సిటీబ్యూరో, బొల్లారం, అబిడ్స్ జియాగూడ, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ): ఈనెల 12న హనుమాన్ విజయయాత్ర సందర్భంగా నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, యాత్ర సజావుగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లపై సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ బుధవారం హనుమాన్ యాత్ర నిర్వాహకులతో కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజి ఆడిటోరియంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సివి ఆనంద్ మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో హనుమాన్ విజయయాత్ర నిర్వహించాలని, యాత్ర సందర్భంగా ఎవరైనా కొత్తవారు చేరితే వారిపై దృష్టి పెట్టి సంబంధిత పోలీసు అధికారులకు ముందు జాగ్రత్త చర్యగా తెలియజేయాలన్నారు. ఊరేగింపు సమయంలో నిర్వాహకులు యాత్ర జరుగుతున్న ప్రాంతాల్లో ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచించారు.
విగ్రహాల ఎత్తులో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, రైల్వే బ్రిడ్జ్ కన్నా ఎక్కువ ఎత్తు విగ్రహాలు పెడితే వాటిని వేరే మార్గంలో పంపాలని చెప్పారు. ఊరేగిపంఉలో డిజె సిస్టమ్‌లు లేకుండా చూడాలని, సౌండ్ మిక్సర్ లేకుండా పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకోవాలని సూచించారు. వాతావరణ శాఖ సూచన మేరకు శనివారం వర్షం వచ్చే సూచన ఉందని, ఇందుకోసం జిహెచ్ఎంసి, ట్రాఫిక్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిపి సూచించారు.
ఊరేగింపులో ఎంతమంది ఎన్ని వాహనాలు వినియోగిస్తున్నారో ముందుగానే ట్రాఫిక్ పోలీసులకు తెలియచేయాలని, నిర్వాహకులు రోప్ పార్టీ సభ్యులకు శిక్షణనిచ్చి వారిని వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో 150, సైబరాబాద్, రాచకొండ పరిధిలో నుంచి 46 విజయయాత్రలు తీస్తున్నారని సిపి సివి ఆనంద్ తెలిపారు.
ఈ యాత్రకు మొత్తం 17వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అదనపు బలగాలతో మరింత బందోబస్తు కల్పిస్తామని సిపి తెలిపారు. ప్రధాన విజయయాత్ర డౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమై నారాయణగూడ, ఆర్టిసి చౌరస్తా, అశోక్‌నగర్, కవాడిగూడ, బైబిల్‌హౌజ్ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్ వరకు దాదాపు 12.2 కిలోమీటర్ల మార్గాన్ని నిర్వాహకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్శనలో సిపి వెంట లాఅండ్ ఆర్డర్ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్, విహెచ్పి రాష్ట్ర అధ్యక్షడు బి. నర్సింహమూర్తి, భజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీరాములు, విహెచ్పి రాష్ట్ర కన్వీనర్ అఖిల్‌లతో పాటు సైబరాబాద్; రాచకొండ పోలీసులు అధికారులు పాల్గొన్నారు.