పోచారం, మే1: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ ప్రతాపసింగారంలోని డబుల్బెడ్రూం ఇండ్లను అర్హులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ఆదివారం ఆందోళనకు దిగారు. ప్రతాపసింగారంలోని 90 డబుల్ బెడ్రూం ఇండ్లను అసలైన అర్హులకు కాకుండా కాంగ్రెస్ నాయకులు ఏకపక్షంగా నిర్ణయించి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కేటాయించారని మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ప్రతాపసింగారం గ్రామ మాజీ సర్పంచ్ శివశంకర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులు నిరసన వక్తం చేశారు.
ముందుగా ప్రతాపసింగారంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైటాయించి ఆందోళన చేసిన లబ్ధిదారులు అనంతరం డబుల్ బెడ్రూంల ఇండ్ల వరకు ర్యాలీగా వెళ్లి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి నాయకులను, లబ్ధిదారులను స్టేషన్కు తరలించారు.