మణికొండ, జూలై 1 : తెలంగాణ ముద్దుబిడ్డ, సినీనటుడు దివంగత డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రభాకర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని మణికొండ మున్సిపాలిటీ చిత్రపురికాలనీ ఎంఐజీ ప్రధాన రహదారిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి హాజరై చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, సినీ డైరెక్టర్ ఎన్.శంకర్, కాలనీ అధ్యక్షుడు అనిల్ వల్లభనేనిలతో కలిసి ప్రభాకర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రభాకర్‌రెడ్డి సతీమణి సంయుక్తను సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చిత్రసీమకు ప్రత్యేక స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రభాకర్‌రెడ్డి మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తెలుగు చిత్రసీమను తరలించే సమయంలో కార్మికుల సంక్షేమం గురించి ముందుచూపుతో ఆలోచించిన వ్యక్తి అని అన్నారు. చిత్రసీమలో పనిచేసే 24 క్రాఫ్ట్స్ కార్మికులకు సొంతిళ్లు ఉండాలనే ఆకాంక్షతో అప్పటి ప్రభుత్వాలను ఒప్పించి చిత్రపురికాలనీకి స్థలాన్ని కేటాయింపజేశారని గుర్తు చేశారు. చిత్ర పరిశ్రమ కార్మికులకు ప్రభాకర్‌రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. చిత్రపురి కాలనీలో ప్రభాకర్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రపురికాలనీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు అనిల్‌కుమార్ వల్లభనేని, కౌన్సిలర్ హైమాంజలి, చిత్రపురి కాలనీ ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ యాదవ్, కార్యదర్శి పీఎస్ఎన్ దొర, సభ్యులు లలిత, కాదంబరి కిరణ్, మహానందరెడ్డి, ప్రసాదరావు, రామకృష్ణ ప్రసాద్, రఘుబత్తుల, దీప్తి వాజ్‌పేయి, అనిత నిమ్మగడ్డ, సినీ దర్శకుడు శంకర్, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కె.రామకృష్ణారెడ్డి, పార్టీ అధ్యక్షుడు బి.శ్రీరాములు, మాజీ ఎంపీపీ మల్లేశ్, నాయకులు శ్రావణ్‌కుమార్, కుమార్, శ్రీకాంత్, సదానంద, డీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.