సిటీ బ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): నగరంలో గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అవినీతి అక్రమాలపై ఆధారాలతో సహా వాల్ పోస్టర్లు వెలువడం కలకలం రేపింది. ఆ రెండు శాఖలో అవినీతి, అక్రమాలను ఎండగడుతూ ఆయా శాఖల కార్యాలయాల పరిధిలో రాత్రికి రాత్రే పోస్టర్లు దర్శనమిచ్చాయి. రెండు శాఖల అవినీతి బాగోతాలను బయటపెడుతూ అజ్ఞాత వ్యక్తులు కార్యాలయాల గోడలతోపాటు సమీపంలోని బస్టాండ్లలో పదుల సంఖ్యలో పోస్టర్లు అంటించారు.
కాలుష్య నియంత్రణ మండలి మెయిన్ గేట్కే పోస్టర్లు అంటించడంతో ఉదయం కార్యాలయానికి వెళ్లగానే సెక్యూరిటీ సిబ్బందితో వాటిని తొలగించారు. వాల్ పోస్టర్లలో ఆధారాలతో సహా ప్రింట్ చేసి బహిరంగంగా గోడలపై అంటిస్తున్నారంటే కాలుష్య నియంత్రణ మండలి, గనుల శాఖ అధికారులు ఎంత మేర అవినీతికి పాల్పడుతున్నారో స్పష్టమవుతున్నది. ఆ రెండు శాఖలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే వాల్ పోస్టర్ల ద్వారా అక్రమాలను బయటపెడతున్నట్లు స్పష్టం అవుతున్నది.

గనులు, పీసీబీ అక్రమాలు బట్టబయలు
గనులు, క్వారీల అనుమతుల్లో మైనింగ్ శాఖ భారీగా అవినితీ అక్రమాలకు పాల్పడినట్లు పోస్టర్లో ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. కాజీపల్లిలోని సర్వేనెంబర్ 144లో రూ.47.92 కోట్ల డిమాండ్ నోటీసు పెండింగ్‌లో ఉన్నా క్వారీ ప్లాన్, ఎంఆర్సీసీ లేకుండా 8 ఏండ్లు అక్రమ తవ్వకాలను ప్రోత్సహించారని, దీనివల్ల ప్రభుత్వానికి రూ.400 కోట్ల ఆదాయానికి గండి పినట్లు ఆరోపించారు. అదేవిధంగా పెనాల్టీని రికవరీ చేయకుండా, ఎంఆర్సీసీ లేకుండానే అదే లీజు హోల్డర్‌కు 7 కొత్త క్వారీలకు అక్రమంగా గ్రాంట్ అనుతులు ఇచ్చినట్లు, ్రైస్టెక్ ఆఫ్ అయిన కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా గ్రాంట్ ఆర్డర్లు ఇచ్చినట్లు పోస్టర్లో పేర్కొన్నారు. మైనింగ్ నిబంధనలను తుంగలో తొక్కి.. 2 వేలకు పైగా పెనాల్టీలను వసూలు చేయకుండా లీజు హోల్డర్లకు సహకరిస్తూ జేబులు నింపుకున్నారని ఆరోపించారు. తప్పులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు డీఎంజీ కోర్టుకు వెళ్లాలని ప్రోత్సహించి అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని విమర్శించారు.
పీసీబీలో అడుగడుగునా అక్రమాలే..
గనుల తవ్వకాల పేరిట సహజ వనరులను, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ కాలుష్య కారకాలతో నింపేస్తుంటే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే కాజీపల్లిలోని ఓ క్వారీకి 2.7 ఎకరాల్లో అడ్డగోలుగా తవ్వేందుకు అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. క్వారీల చుట్టూ కోర్డినేట్స్, ఫెన్సింగ్, 7 మీటర్ల గ్రీనరీ లేకుండా మైనింగ్ చేస్తుంటే పీసీబీ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. బెంచ్ కటింగ్ లేకుండా తవ్వే చాలా క్వారీలకు పీసీబీ అధికారులు సహకరిస్తున్నారని విమర్శించారు. అనుమతి కంటే ఎక్కువ లోతుకు తవ్వడం వల్ల నీటి మట్టం తగ్గి, వ్యవసాయదారులను ఇబ్బందులకు గురి చేస్తుంటే చోద్యం చూస్తున్నారని పోస్టర్లో పేర్కొన్నారు. అక్రమార్కులకు సహకరిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న అధికారులపై క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.