అమీర్‌పేట, ఆగస్టు 27 : సనత్‌నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణుల మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది. నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ఎస్.రవీందర్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి ఆదిత్యా రెడ్డి, డాక్టర్ కోట నీలిమ పోటీ పడుతున్నారు. ఎవరికి వారే.. యమునా తీరే.. అన్న చందంగా కొనసాగుతున్న ఈ ముగ్గురి పార్టీ ప్రచార కార్యక్రమాలు నియోజకవర్గం కార్యకర్తల మధ్య ఒకింత ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న ఈ దశలో పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసే దిశగా ఎవరికి వారు తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని ఆశపడుతున్న డాక్టర్ రవీందర్‌గౌడ్ ఇటీవల తన అనుచరులతో కలిసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇదే సీటుకు పోటీ పడుతున్న డాక్టర్ నీలిమ కూడా తమ ప్రచారాన్ని అంతే ఉధృతంగా సాగిస్తున్నారు. కాగా, నాయకుల మధ్య నెలకొన్న పోటీతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గం పరిధిలో డాక్టర్ రవీందర్‌గౌడ్ ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్ల స్థానంలోనే డాక్టర్ నీలిమ వాల్ పోస్టర్లు వెలిశాయి. డాక్టర్ నీలిమ వర్గీయులు కావాలనే తమ పోస్టర్లను చించివేసి వాటి స్థానంలో తమ పోస్టర్లు పెట్టుకున్నారంటూ డాక్టర్ రవీందర్‌గౌడ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. వాల్ పోస్టర్ల ఈ వివాదం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో చర్చనీయాంశంగా మారింది.