సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ వార్డుల విభజన ప్రక్రియను గుట్టుగా ముగించాలని భావించిన బల్దియాకు న్యాయస్థానం రూపంలో చుక్కెదురైంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జీహెచ్ఎంసీలోకి 27 పురపాలికలను విలీనం చేసుకోవడమే కాకుండా 150 ఉన్న డివిజన్లను 300ల వరకు పెంచి వారం వ్యవధి గడువుతో డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు, సలహాలు ఇవ్వాలని ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ముందస్తుగా ప్రజల అభిప్రాయాలు, పార్టీలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వ ఆదేశాలనుసారం ఏకపక్షంగా జీహెచ్ఎంసీ వ్యవహరించింది.
రెండు రోజుల కిందట జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ వేదికగా ప్రజాప్రతినిధులంతా ముక్తకంఠంతో వార్డుల పునర్విభజనను వ్యతిరేకించారు. వార్డుల విభజనలో శాస్త్రీయత ఏ మాత్రం పాటించలేదని, వార్డుల జనాభాలో వ్యత్యాసాలు ఉన్నాయని, డివిజన్లను అర్థంపర్థం లేకుండా ముక్కలు ముక్కలుగా విభజించారని, ఇంత హడావుడిగా విలీనం, వికేంద్రీకరణ ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ భగ్గుమన్నారు. గడిచిన వారం రోజుల వ్యవధిలో దాదాపు 5905 మంది నుంచి అభ్యంతరాలు రావడం, ఈ నేపథ్యంలోనే డివిజన్ల పునర్విభజనపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
పిటీషన్ల వాదనలను విన్న న్యాయస్థానం అభ్యంతరాల గడువును మరో రెండు రోజుల పాటు పొడగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. జనాభా సంఖ్యతో పాటు వార్డుల వారీగా మ్యాపులను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని సూచించింది.దీంతో డివిజన్ల జనాభా, మ్యాపులను జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌తో పాటు ప్రధాన కార్యాలయం, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో ప్రదర్శన పెట్టి దానికి అనుగుణంగా అభ్యంతరాలను జీహెచ్ఎంసీ స్వీకరించనున్నది.
అభ్యంతరాలు స్వీకరించక తప్పని పరిస్థితి
డీలిమిటేషన్‌కు సంబంధించి అభ్యంతరాల గడువు వాస్తవంగా బుధవారంతో ముగియాల్సి ఉంది. వారం రోజుల వ్యవధిలో దాదాపుగా 5905 మంది నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాల మేరకు గురు, శుక్ర (నేడు, రేపు) రెండు రోజుల పాటు ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయంలో అభ్యంతరాలను స్వీకరించక తప్పని పరిస్థితి నెలకొంది.
కేంద్రాన్ని బూచిగా చూపించి..
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియను డిసెంబర్ చివరికి పూర్తి చేస్తే రాబోయే జనగణనకు ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వ సూచనను పరిగణనలోకి తీసుకుని జీహెచ్ఎంసీ అధికారులు హడావుడిగా ఈ తంతును ముగించాలని కమిషనర్ కర్ణన్ భావించారు. దేశంలోని అన్ని లోకల్ బాడీల వివరాలు ఇవ్వాలని ఇటీవల కేంద్రం రాష్ర్టాలను ఆదేశించింది. ఎన్ని వార్డులు ఉన్నాయని, ఎంత జనాభా ? వార్డులు ఎన్ని ఉన్నాయని వివరాలను కోరింది. ఇందుకుగానూ ఈ నెల 31 వరకు డెడ్‌లైన్ ఇచ్చింది. దీనిని సాకుగా చూపించిన జీహెచ్ఎంసీ అధికారులు ఆగమేఘాల మీద విలీనం, వికేంద్రీకరణ ప్రక్రియను ఏకపక్షంగా ముగించాలన్న ప్రయత్నానికి న్యాయస్థానం రూపంలో చేదు అనుభవం ఎదురైంది.
పోటెత్తుతున్న అభ్యంతరాలు
అభ్యంతరాల చివరి రోజు సాయంత్రం వరకు అన్ని సర్కిళ్లు, జోన్లు, ప్రధాన కార్యాలయాల్లో అభ్యంతరాలు వెల్లువలా వచ్చాయి. కమిషనర్ కర్ణన్‌ను విపక్ష పార్టీల నేతలు పలువురు కలిశారు. కొన్ని జోన్ల పునర్వ్యవస్థీకరణ, సమీప జోన్లలో విలీనం వంటి అంశాలకు సంబంధించి ఫిర్యాదులు చేశారు. కాగా గడిచిన వారం రోజుల నుంచి వచ్చిన అభ్యంతరాలను త్వరితగతిన పరిష్కారం చూపేందుకుగానూ జోన్ల వారీగా ఐదుగురితో ప్రత్యేక కమిటీ వేశారు.
అభ్యంతరాల వెల్లువ
తేదీ : ఫిర్యాదులు
10 : 40
11 : 280
12 : 373
13 : 408
14 : 227
15 : 1,774
16 : 1,475
17 : 1,328
మొత్తం : 5,905
డీలిమిటేషన్ వివరాలు వెబ్సైట్లో పెట్టండి

హైదరాబాద్, (నమస్తే తెలంగాణ) :జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించిన హైకోర్టు.. వార్డులు, జనాభా వివరాలు, వార్డుల వారీగా మ్యాప్ ను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. ఈ వివరాల్ని బహిర్గతం చేశాక ప్రజలు, పిటీషనర్లు ఎవరైనా అభ్యంతరాలు తెలియజేసేందుకు మరో రెండు రోజుల గడువు ఇవ్వాలంది. పబ్లిక్ డొమైన్లో వివరాలు పెట్టాక రెండు రోజుల గడువు ఉంటుంది. ఈ మేరకు హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది.
డివిజన్ల పెంపు లోప భూయిష్టం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కి సమీపంలోని మున్సిపాల్టీలను, గ్రామాలను విలీనం చేసి డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంపు ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నాగేంద్ర ప్రకాశ్‌రెడ్డి ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లల్లో డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదన అశాస్త్రీయమని, మ్యాప్‌లు అందుబాటులో పెట్టలేదని, డివిజన్లలో జనాభా సంఖ్యలో చాలా వ్యత్యా సం ఉందన్నారు.
కొత్త డివిజన్ల ఏర్పాటుకు డిసెంబర్ 5న కమిషనర్‌కు నివేదిక అందిందని, మరో 4 రోజులకే ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడిందని, జీహెచ్ఎంసీ 650 చదరపు కిలోమీటర్ల ప్రస్తుత విస్తీర్ణం 2000 చదరపు కిలోమీటర్లకు పెంపునకు తీసుకున్న సమాచారం బహిర్గతం కాలేదన్నారు. వార్డుల డీలిమిటేషన్ రూల్స్‌లోని 5వ నిబంధన ప్రకారం తాజా జనాభా లెకల ఆధారంగా వార్డుల ఏర్పాటు తప్పనిసరని పేరొన్నారు. వార్డుల మధ్య జనాభా వ్యత్యాసం 10% మించకూడదని, పలు వార్డుల మధ్య జనాభా వ్యత్యాసం ఉందన్నారు.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ. సుదర్శన్ రెడ్డి ప్రతివాదన చేస్తూ, వార్డుల విభజన ఒకరోజులో తీసుకున్న నిర్ణయం కాదని సమగ్ర అధ్యయనం, చర్చల తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల నగర అభివృద్ధి ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ వరకు మునిసిపాలిటీల విస్తరణతో రానున్న రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. ఇప్పటికే 3,102 అభ్యంతరాలు వచ్చాయని, వాటిని చట్ట ప్రకారం పరిషరిస్తామని తెలిపారు. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు.. వార్డుల విభజన ప్రక్రియను నిలిపివేయడానికి నిరాకరిస్తూనే, వార్డుల విభజనలో పారదర్శకత అవసరమని అభిప్రాయపడింది.. వార్డుల వారీగా జనాభా వివరాలు, మ్యాప్‌లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలో ప్రజలు, పిటిషనర్లు అభ్యంతరాలు చెప్పేందుకు గడువు ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది.