బంజారాహిల్స్, సెప్టెంబర్ 24: ‘నెలరోజుల్లో కృష్ణానగర్లో వరద సమస్యలు లేకుండా చేస్తాం..’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర మంత్రులు ఆర్భాటంగా ప్రకటించి మూడునెలలు పూర్తయింది. వర్షాకాలంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణానగర్ బీ-బ్లాక్లో భారీగా వచ్చిన వరదనీటితో స్థానికులు అష్టకష్టాలు పడ్డారు. భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా బైక్లు, ఆటోలు కొట్టుకుపోయాయి.
తీవ్రమైన వరద పరిస్థితి ఉన్నప్పుడు కనీసం కృష్ణానగర్ వైపు కన్నెత్తి చూడని మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, హైడ్రా కమిషనర్ రంగనాథ్.. వర్షం తగ్గి రెండ్రోజుల తర్వాత తీరిగ్గా బుధవారం పర్యటించారు. అయితే వరద సమస్యలను పరిష్కరిస్తామంటూ శంకుస్థాపనలు చేస్తున్న మంత్రుల మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయని, వరద తగ్గిన తర్వాత బురదలో తిరుగుతూ.. రాజకీయం చేసేందుకు వచ్చారంటూ స్థానికులు గుసగుసలాడడం విశేషం. సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారంటూ స్థానికులు ప్రశ్నించగా, వర్షాలు తగ్గిన వెంటనే అంటూ మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.