సిటీబ్యూరో, అక్టోబరు 21 (నమస్తే తెలంగాణ ): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ రోజు, పోలింగ్ ముందు రోజు పత్రికల్లో రాజకీయ ప్రకటనలు ప్రచురించాలంటే తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల 11వ తేదీన జరుగనుందని అన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మీడియా సంస్థలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఓటర్లను ప్రభావితం చేసే తప్పుడు, మభ్యపెట్టే, నిర్ధారణ లేని ప్రకటనలను నిరోధించడమే ఈ నిబంధన ఉద్దేశమని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. ప్రకటనలను ప్రచురించే ముందు కనీసం రెండు రోజుల ముందుగానే ఎంసీఎంసీకి దరఖాస్తు చేయాలని, తద్వారా సమీక్షకు తగిన సమయం లభిస్తుందని వివరించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే ఎంసీఎంసీ అనుమతి తీసుకోవలసి ఉంటుందన్నారు.
ఉపఎన్నికల పరిశీలకుల నియామకం
సిటీబ్యూరో, అక్టోబరు 21 (నమస్తే తెలంగాణ ) : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహణను నిష్పాక్షికంగా, పారదర్శకంగా, శాంతియుతంగా జరపడానికి భారత ఎన్నికల సంఘం ముగ్గురు సీనియర్ అధికారులను పరిశీలకులుగా నియమించింది. ఉప ఎన్నిక సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి రంజిత్‌కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులుగా ఐపీఎస్ అధికారి ఓం ప్రకాశ్ త్రిపాఠి, వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సంజీవ్కుమార్లాల్లను నియమించింది. ఈ అధికారులు ఎన్నికల ప్రక్రియలో సాధారణ పర్యవేక్షణ, శాంతిభద్రతల పరిశీలన, పార్టీలు, అభ్యర్థుల ఖర్చుల పర్యవేక్షణ వంటి అంశాలను పరిశీలకులు పర్యవేక్షిస్తారు. ఈ పరిశీలకులు ఎన్నికల నిబంధనల అమలు, శాంతి భద్రతలు, ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ వంటి అంశాలను దగ్గరగా పర్యవేక్షిస్తారని అధికారులు తెలిపారు.
స్వేచ్ఛాయుతంగా ఉప ఎన్నిక నిర్వహించాలి
సిటీబ్యూరో, అక్టోబరు 21 (నమస్తే తెలంగాణ ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా చూడాలని సాధారణ పరిశీలకులు రంజిత్‌కుమార్ సింగ్ ఎన్నికల అధికారులకు సూచించారు. బేగంపేట టూరిజం ప్లాజాలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, అడిషనల్ కమిషనర్ (ఎలక్షన్), హేమంత్ కేశవ్ పాటిల్, రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరాం, వివిధ నోడల్ అధికారులు సాధారణ పరిశీలకులు రంజిత్‌కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులు ఓం ప్రకాశ్ త్రిపాఠి, వ్యయ పరిశీలకులు సంజీవ్‌కుమార్ లాల్‌లను కలుసుకున్నారు. ఈ సమావేశంలో డీఈఓ, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలకులకు వివరించారు.
ఎన్నికల విధులు జనరల్ డ్యూటీగా భావించవద్దని, ఇది గురుతర బాధ్యత అని సాధారణ పరిశీలకులు రంజిత్‌కుమార్ సింగ్ అన్నారు. ప్రతి అధికారి, సిబ్బంది నిష్పాక్షికంగా, నిజాయితీగా, నిబద్ధతతో విధులు నిర్వహించాలని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.90 లక్షలు స్వాధీనం చేసుకోగా, ఈ బై ఎలక్షన్లో ఇప్పటి వరకు రూ.2.25 కోట్లు స్వాధీనం అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. బై ఎలక్షన్ ప్రాధాన్యత దృష్ట్యా ఈసీఐ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని పోలీస్ పరిశీలకులు ఓం ప్రకాశ్ త్రిపాఠి అన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి రూపాయిని వారి ఖాతాల్లో జమ చే సేలా చూడాలని వ్యయ పరిశీలకు లు సంజీవ్ కుమార్ లాల్ పేర్కొన్నారు.
ఆర్వో కార్యాలయం సందర్శన
సాధారణ, పోలీస్, వ్యయ పరిశీలకులు, డీఈఓ, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలోని ఆర్వో కార్యాలయాన్ని సందర్శించారు. ఏ ర్పాట్లను పరిశీలించారు.