పోలీసు సిబ్బంది ఆరోగ్యమే లక్ష్యంగా గోషామహల్‌లోని శివకుమార్ లాల్ పోలీసు స్టేడియంలో సిటీ పోలీసు వార్షిక స్పోర్ట్స్ మీట్ -2023ను హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ప్రముఖ సినీనటుడు అడివి శేష్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాస్కెట్‌బాల్ ఆడుతున్న సీపీ సీవీ ఆనంద్, సినీ నటుడు అడివి శేషు తదితరులు
అబిడ్స్, మార్చి 15 : పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. గోషామహల్‌లోని శివకుమార్ లాల్ పోలీస్ స్టేడియంలో సిటీ పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్ -2023ను ప్రముఖ సినీనటుడు అడివి శేషుతో కలిసి బుధవారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సిటీ పోలీస్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.
సిటీ పోలీసు విభాగంలోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాలుపంచుకుంటూ పోలీసు శాఖకు వన్నె తెస్తున్నారని అన్నారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసి ఆకాశంలోకి బెలూన్లను వదిలారు. ఈ సందర్భంగా అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, రన్నింగ్ తదితర విభాగాలలో పోటీ పడుతున్న క్రీడాకారులను కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతిభద్రతల విభాగం అదనపు కమిషనర్ విక్రమ్‌సింగ్ మాన్, ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు, క్రైమ్ అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీ విశ్వప్రసాద్, కోఆర్డినేషన్ జాయింట్ సీపీ గజారావు భూపాల్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సీపీ ఎం.శ్రీనివాసులు, డీసీపీలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.