సిటీబ్యూరో, నవంబర్ 21(నమస్తే తెలంగాణ) : పోలీసులు వృత్తి పరంగా రాణించాలంటే అంతర్గతంగా శిక్షణ అవసరమని, ఇందుకోసమే ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం పేరుతో నైపుణ్యాభివృద్ధి శిక్షణను నిర్వహిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. శుక్రవారం పేట్ల బురుజు, చేలపుర సీటీసీ శిక్షణా కేంద్రాలను సీపీ సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యక్రమ తీరును పరిశీలించారు.
పోలీసు సిబ్బందిలో నైపుణ్యాలను పెంపొందించి ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే ఈ శిక్షణాకార్యక్రమ ప్రధాన ఉద్దేశమని సజ్జనార్ పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని 19,488 మంది పోలీసుల సిబ్బందికి దశలవారీగా శిక్షణనిస్తామని, సిటీ పోలీస్ చరిత్రలోనే అందరికీ ఈ తరహా శిక్షణనివ్వడం ఇదే ప్రథమమని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణనిచ్చేందుకు 178 మంది ప్రత్యేక శిక్షకులను ఎంపిక చేశామని, వీరంతా వారివారి డివిజన్లలోని సిబ్బందికి శిక్షణనిస్తారని చెప్పారు.
పేట్లబురుజు, చేలపుర సీటీసీలలో హోంగార్డు స్థాయి నుంచి సబ్ఇన్స్పెక్టర్ స్థాయివరకు మొత్తం 350 మంది చార్మినార్ డివిజన్, మీర్‌చౌక్ డివిజన్, కార్హెడ్క్వార్టర్, హోంగార్డు ఆఫీసు సిబ్బందితో పాటు మహిళా కానిస్టేబుళ్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీసీపీ హెడ్‌క్వార్టర్స్ రక్షితకృష్ణమూర్తి, అడిషనల్ డీసీపీలు బి.కిష్టయ్య, ఎన్.భాస్కర్లు పాల్గొన్నారు.