అబిడ్స్/సుల్తాన్‌బజార్: గోషామహల్‌ను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. స్థానికుల నిరసనలు.. వివిధ పార్టీల నాయకుల ముందస్తు అరెస్టుల మధ్య శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి గోషామహల్ స్డేడియంలో ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసి వెళ్లారు. అంతకుముందు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు గోషామహల్ పరిరక్షణ సమితితో పాటు వివిధ పార్టీల నాయకులు శత విధాలా ప్రయత్నం చేసినా.. పోలీసులు మాత్రం ముందస్తు అరెస్టులు చేసి కార్యక్రమాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు.
ఉస్మానియా దవాఖాన శంఖుస్థాపన సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్, బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆనంద్‌కుమార్‌గౌడ్, ఆశిష్ కుమార్ యాదవ్, సురేశ్ ముదిరాజ్‌లతో పాటు పలువురు బీజేపీ నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.
వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలోని వివిధ పార్టీల నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి.. సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా, అరెస్టులకు భయపడేది లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆనంద్‌కుమార్ గౌడ్, ఆశిష్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. అక్రమంగా అరెస్టులు చేసి.. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా దవాఖాన నూతన భవనాన్ని నిర్మించడాన్ని చూస్తూ ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు.