Secunderabad | సికింద్రాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన హిందూ సంఘాల కార్యకర్తలు, పోలీసుల మధ్య గొడవ మొదలైంది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలోని అమ్మవారి విగ్రహాన్ని సోమవారం తెల్లవారుజామున ఓ ఆగంతకుడు ధ్వంసం చేశాడు. కాళ్లతో తన్నుకుంటూ లోనికి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని కాళ్లతో తన్నుతూ పడగొట్టాడు. ఆలయం గద్దెపైకి ఎక్కి మరింత ధ్వంసానికి పాల్పడుతుండగా.. స్థానికులు పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ వీరంగమంతా సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి. కాగా, దీంతో ఆగంతకుడిపై 333,331(4), 196,298, 299 బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ముత్యాలమ్మ ఆలయంపై దాడిని నిరసిస్తూ శనివారం ఉదయం హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపాయి. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. తమను అడ్డుకోవడంతో ఆందోళనకారులు పోలీసులపై చెప్పులు, కుర్చీలు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో
సికింద్రాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు సమాచారం.