సిటీబ్యూరో, మార్చి 4(నమస్తే తెలంగాణ): హైద రాబాద్ శివారులో రెచ్చిపోయిన ఏటీఎం దొంగల ఆచూకీ మూడు రోజులువుతున్నా దొరకలేదు. రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం మిషన్‌ను కట్టర్లతో కట్‌చేసిన దొంగల ముఠా అందులోని రూ. 30 లక్షలతో పరారైంది. ఇదే ముఠా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ ఎస్బీఐ ఏటీఎంను కట్టర్లతో కట్‌చేసి అపహరించేందుకు విఫలయత్నం చేసినట్లు నిర్ధారణ అయ్యింది.
అయితే మైలార్‌దేవ్‌పల్లిలో కట్టర్లతో కట్ చేస్తుండగా.. అగ్ని ప్రమాదం సంభవించి ఏటీఎం అగ్నికి ఆహుతి అయ్యిందని, అందులోని రూ.7లక్షల నగదు కూడా కాలిపోయిందనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, ఇదే ముఠా బెంగళూర్‌లోనూ ఎస్బీఐ ఏటీఎంను అపహరించిందని పోలీసులు ఆధారాలు సేకరించారు. బెంగళూర్ శివారులో శనివారం తెల్లవారుజామున ఎస్బీఐ ఏటీఎంలో సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి కట్టర్లతో ఏటీఎం యంత్రాన్ని కోసి అందులో ఉన్న రూ. 30 లక్షలు దొంగలు అపహరించారు.
మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని రావిర్యాలలో ఏటీఎం యంత్రాని కట్‌చేసి అందులోని రూ.30లక్షలు అపహరించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూడు ఘటనలకు పాల్పడింది ఒకే ముఠా అని పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ ముఠా ఉపయోగించిన కారును గుర్తించిన పోలీసులు బెంగళూర్, రావిర్యాల, మైలార్‌దేవ్‌పల్లిలో జరిగిన ఘటనల పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను విశ్లేషించడంతో కారుకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. దీంతో 24 గంటల వ్యవధిలోనే ఈ అంతర్రాష్ట్ర ముఠా ఈ ఏటీఎం చోరీలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఎస్బీఐ ఏటీఎంలే లక్ష్యంగా..!
ఏటీఎం కేంద్రాన్ని చోరీ చేయాలంటే దొంగలు ఎక్కువగా ఎస్బీఐ ఏటీఎంలనే ఎంచుకుంటున్నారు. ఇక్కడ భద్రత సరిగా ఉండకపోవడాన్ని గుర్తించిన దొంగలు ఈజీగా దొంగతనం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఏటీఎం దొంగతనాల్లో ఎక్కువగా ఎస్బీఐకి సంబంధించినవే ఉంటున్నాయి. చాలా కేంద్రాల్లో సీసీ కెమెరాలతోనే బ్యాంకులు భద్రత నిర్వహిస్తున్నాయి. పోలీసుల సూచనలు పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
రావిర్యాలలో ఏటీఎంను కొల్లగొట్టిన తరువాత మైలార్‌దేవ్‌పల్లి ఎస్బీఐ ఏటీఎంను టార్గెట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒకే రోజు రెండు కాజేయాలని ప్రయత్నించిన ఏటీఎం దొంగలు ఏ రూట్లో వచ్చి ఏ రూట్లో నుంచి వెళ్లిపోయారనేది పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. నిందితులు ఏపీ రిజిస్టేష్రన్‌తో ఉన్న కారును వాడినట్లు ఆధారాలు సేకరించారు. అయితే దొంగలు వాడిని కారు నంబర్ ఫేక్ అని తేలినట్లు సమాచారం. రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో ఎవరు లేరని నిర్ధారించుకున్న తరువాతే దొంగతనానికి పాల్పడ్డారా? అర్ధరాత్రి వేళ తిరుగుతూ అనువైన చోట కారు ఆపి ఎస్బీఐ ఏటీఎంలను టార్గెట్ చేశారా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ ఏటీఎం చోరీ ముఠా కోసం ఇటూ రాచకొండ, అటూ సైబరాబాద్ పోలీసులతో పాటు బెంగళూర్ పోలీసులు కూడా గాలిస్తున్నారు. చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాలు పొరుగు రాష్ర్టాల్లో గాలింపు చేపట్టారు. దొంగలు పరారైన రూట్లు, టోల్గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను విశ్లేషించారు. సంఘటన జరిగిన సమయంలో దొంగలు ఫోన్లు వాడారా? లేదా? అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక పక్క సాంకేతికపరమైన అంశాలను విశ్లేషిస్తూ, మరో పక్క ఇతర రాష్ర్టాలలోని ఏటీఎం దొంగల ముఠాలకు సంబంధించిన వివరాలను సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు.