6.5 కిలోమీటర్లు సాగనున్న యాత్ర… భారీ బందోబస్తు
సీసీ, డ్రోన్ కెమెరాలతో నిఘా
పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్
సిటీబ్యూరో, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ): నగరంలో ఆదివారం జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీతారాంబాగ్ నుంచి మొదలై..ఆరున్నర కిలోమీటర్ల పాటు సాగే శోభాయాత్ర చివరకు సుల్తాన్‌బజార్ హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుంది. ఈ మార్గంలో ఎలాంటి అవరోధాలు లేకుండా పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు. సీసీ, డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా పెట్టి.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. మరోవైపు హైకోర్టు అనుమతి ఇచ్చిన మార్గంలోనే శోభాయాత్ర నిర్వహించాలని సీపీ స్పష్టం చేశారు. సిటీ శాంతి భద్రతల అదనపు సీపీ డీఎస్ చౌహాన్, స్పెషల్ బ్రాంచి జాయింట్ సీపీ విశ్వప్రసాద్, హైదరాబాద్ కార్ హెడ్ క్వార్టర్స్, జాయింట్ సీపీ కార్తికేయ, అడ్మిన్ అదనపు సీపీ రమేశ్, ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ చక్రవర్తి, ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్ శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా నిరంతరం పరిస్థితులను సమీక్షిస్తారు.
ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే శోభాయాత్ర రాత్రి 10 గంటల వరకు సాగనున్నది. సీతారాంబాగ్ నుంచి బోయిగూడ కమాన్, మంగళ్‌హాట్ పీఎస్ రోడ్డు, జాలి హనుమాన్, ధూల్‌పేట్, పురానాపూల్, గాంధీ విగ్రహం, జుమ్మేరాత్ బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ చమన్, గురుద్వారా, పుత్లిబౌలి క్రాస్ రోడ్డు, కోఠి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు శోభాయాత్ర చేరుకుంటుందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో వాహనాదారులకు అనుమతి ఉండదని, ఇందుకోసం పలు చోట్ల డైవర్షన్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్లు..
ఏదైనా ట్రాఫిక్ సమస్య ఏర్పడినా, వాటికి సంబంధించి సమాచారం ఇవ్వాలన్నా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నం. 040-27852482 లేదా హెల్ప్‌లైన్ నం. 9010203626కు తెలియజేయాలని ఉన్నతాధికారులు సూచించారు. అదే విధంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ట్విట్టర్, ఫేస్బుక్లో కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవచ్చని, ఫిర్యాదులు చేయవచ్చని స్పష్టం చేశారు. ఎవరైనా మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు వంటివి పోస్ట్ చేస్తే… బాధ్యులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదవుతాయని ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు.
ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు
మల్లెపల్లి జంక్షన్, బోయిగూడ కమాన్, ఆఘాపుర జంక్షన్, పురానాపూల్ క్రాస్‌రోడ్, ముస్లిం జంగ్ బ్రిడ్జి, అలస్క టీ జంక్షన్, లేబర్ అడ్డా, అఫ్జల్‌గంజ్ టీ జంక్షన్, రంగ్‌మహల్ జంక్షన్, పుత్లీబౌలి క్రాస్‌రోడ్, ఆంధ్రాబ్యాంక్ జంక్షన్, డీఎం అండ్ హెచ్ఎస్ జంక్షన్, సుల్తాన్‌బజార్ క్రాస్‌రోడ్.