దుండిగల్, అక్టోబర్16: తల్లిని పొందాలనే దురుద్దేశంతో ఓ దుర్మార్గుడు ఏడేండ్ల చిన్నారిని హత్య చేశాడు. సూరారం పీఎస్ పరిధిలో ఈ నెల 12న జరిగిన ఏడేండ్ల బాలిక హత్య కేసు మిస్టరినీ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేశారు. బుధవారం సూరారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రభాకర్, సుమ దంపతుల కుటుంబం ఏడు నెలల కిందట నగరానికి వచ్చి, సూరారం కాలనీలోని జీవనజ్యోతినగర్లో ఉంటుంది.
సుమ భర్త గతంలోనే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ప్రభాకర్‌తో సహజీవనం చేస్తున్నది. ప్రభాకర్ కూలీగా, సుమ గృహిణి. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. స్వగ్రామానికి చెందిన అర్జున్ అనే వ్యక్తి ద్వారా తిరుపతి (31)అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తిరుపతి జీడిమెట్లలోని ఓ కంపెనీలో పనిచేస్తూ.. సూరారంకాలనీలోని దయానంద్‌నగర్‌లో తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే, సుమను మొదటి చూపులోనే ఇష్టపడిన తిరుపతి.. ఎలాగైనా ఆమెను శారీరకంగా అనుభవించాలనుకున్నాడు. ఇందుకోసం రోజూ సుమ, ప్రభాకర్ ఇంటికి వెళ్లి, మంచి చెడు మాట్లాడం మొదలుపెట్టాడు.
ఏదైనా అవసరమున్నా సహకరించాడు. ప్రభాకర్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన బైక్‌పై తిప్పాడు. పిల్లలతోనూ చనువు పెంచుకోవడంతో వారు మామ అని పిలువడం మొదలుపెట్టారు. తనలో దాగి ఉన్న కోరికను తిరుపతి ఏనాడు వెల్లడించలేదు. సుమ తనకు దక్కాలంటే ప్రభాకర్‌తో సహా వారి ఇద్దరి పిల్లలను కడతేర్చాలనుకున్నాడు. ఇందుకోసం ఓ పదునైన కత్తిని కొనుగోలు చేసి ఇంట్లోనే దాచాడు. అవకాశం కోసం వేచిచూస్తున్నాడు. ఈ నెల 12న దసరా పండుగ రోజున మధ్యాహ్నం తిరుపతి సుమ ఇంటికి వెళ్లాడు. అరగంట పాటు మాట్లాడి తిరిగి తన ఇంటికి వెళ్తుండగా.. సుమ దంపతులు పెద్ద కుమార్తె జ్యోత్స్న (7) తిరుపతి ఇంటికి వెళ్తానని అడిగింది.
దీంతో జ్యోత్స్నను తన బైక్‌పై కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకువెళ్లిన తిరుపతి.. సాయంత్రం బాలికను ఆమె ఇంటి వద్ద దింపాడు. అప్పటికే బాలికను చంపాలని నిర్ణయానికి వచ్చిన తిరుపతి.. కత్తిని ఎవరికీ తెలియకుండా బైక్ ట్యాంక్‌లో దాచాడు. ఆడుకుంటానని మీ అమ్మతో చెప్పి.. బయటకు రా..! నిన్ను బైక్‌పై కాలనీ అంతా తిప్పుతా..అని జ్యోత్న్సతో నమ్మబలికాడు. దీంతో బాలిక ఇంటికి వెళ్లగానే.. ఆడుకుంటానని చెప్పి.. బయటకు రాగానే వేచి ఉన్న తిరుపతి ఆమెను బైక్‌పై ఎక్కించుకుని ఎవరికంటా పడకుండా మేడ్చల్ వైపు తీసుకువెళ్లాడు.
రాత్రి 7 గంటల వరకు బాసర ఘడ్ రోడ్డులో జనసంచారం లేనిచోట బైక్‌ను నిలిపివేశాడు. ఆందోళనగా చూస్తున్న బాలిక నోరును ఓ చేతితో మూసి వేసిన తిరుపతి.. కత్తితో గొంతుకోసి, ఆపై కడుపులో పలుమార్లు పొడిచి కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత శవాన్ని ఓ సిమెంట్ సంచిలో కుక్కి, బండరాయి చాటున వదిలి తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే బాలిక కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆమె కోసం వెతుకుతుండటం గమనించి, తనకేమీ తెలియనట్టు వారితో కలిసి అదే రోజు సూరారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
మంగళవారం ఉదయం బాసర గడి గ్రామంలోని నిర్జన ప్రదేశంలో ఓ గోనె సంచిలో బాలిక శవం ఉందంటూ సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు.. బాలిక జ్యోత్న్స మృతదేహంగా గుర్తించారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. సూరారం కాలనీలోని సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. నిందితుడు తిరుపతి తన బైక్‌పై జ్యోత్స్నను తీసుకెళ్లినట్టు నిర్ధారించుకుని అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బాలికను తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. పైగా బాలిక తండ్రి ప్రభాకర్‌తో పాటు చెల్లెల్ని కూడా హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలపడంతో పోలీసులు షాక్ తిన్నారు. కేవలం ఒక మహిళను పొందెందుకు ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన నిందితుడు తిరుపతిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, బైక్, సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు.