సిటీబ్యూరో, డిసెంబరు 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో జరిగే నూతన సంవత్సర వేడుకలపై పటిష్టమైన నిఘా పెట్టాలని, ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు, ఇతర ప్రాంతాలకు చెందిన నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం సరఫరా, వినియోగం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎస్టిఎఫ్, ఎక్సైజ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సర వేడుకల్లో ఆబ్కారీ నేరాల నియంత్రణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు.
ఈనెల 20నుంచి జనవరి మొదటి వారం వరకు ఎవ్వరూ సెలవులు పెట్టవద్దని ఆదేశించారు. నగరంలో డ్రగ్స్, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం సరఫరా జరగకుండా గట్టి నిఘా పెట్టాలని సూచించారు. రైళ్లు, ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని, నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను దిగుమతి చేసే ముఠాలపై నిఘా పెట్టి ఎన్డీపీఎల్ మద్యాన్ని నిలువరించాలని సూచించారు. పది నుంచి 15రోజుల పాటు ఎస్టిఎఫ్, డిటిఎఫ్, ఇతర ఆబ్కారీ బృందాలతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా కొత్త సంవత్సర వేడుకల్లో నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
నూతన సంవత్సర వేడుకలను నిర్వహించే ఈవెంట్ మేనేజర్ల కదలికలపై నిఘా పెట్టాలని, కమర్షియల్ ఫంక్షన్‌హాల్స్, కన్వెన్షన్స్ హాళ్ళలో నిర్వహించే వేడుకలపై డేగ కన్ను పెట్టాలన్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని నానక్‌రామ్‌గూడ, సింగరేణి కాలనీ, ఎల్బీనగర్, కర్మాన్‌ఘాట్, గోల్కొండ, పుప్పాలగూడ, మణికొండ, రామకృష్ణకాలనీ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్లు ఖురేషీ, కేఏబి శాస్త్రీ, డిప్యూటి కమిషనర్ పి.దశరథ్, అదనపు ఎస్పి భాస్కర్, ఏసీలు ఆర్.కిషన్, అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రణవీ, డిఎస్పిలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్, శంషాబాద్, మల్కాజిగిరి, మేడ్చల్ సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కృష్ణప్రియ, కె.నవీన్, ఫయాజుద్దీన్, ఉజ్వల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.